"అర్జంటుగా ఖమ్మం వెళ్ళే పని పడింది. నాకు తోడు వస్తావా?” ఫోన్లో ఆయన మాటల్లోని హడావిడి చూసి, ఏదో అత్యవసరం అనే అనిపించింది.
"ఆ వస్తాను సార్," అన్నాను.
రంగనాయకులు గారు చెప్పిన ప్రకారం మరుసటి రోజు పొద్దున్న సికింద్రాబాద్ పోయి ఖమ్మం వెళ్ళే రైలు ఎక్కాం. అప్పటిదాకా 'ఎందుకు వెళ్తున్నాం?' అని అడగలేదు. సుఖంగా కిటికీ పక్కన సీట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నా, నా ఎదురుగా కూర్చుని కిటికీ లోంచి బయటికి చూస్తూ చాలాసేపు మౌనంగా ఉన్న ఆయన, “మనం సత్యం దగ్గరికి వెళ్తున్నాం," అన్నారు.
అవునా, ఇన్నాళ్లూ తెర వెనుక విలన్లా ఉన్న సత్యం అలియాస్ స్టాలిన్ లేదా స్టాలిన్ సత్యంని కలవబోతున్నాను. వావ్!
అయితే స్పృహలో ఉండగా కాదని వెళ్ళాక తెలిసింది. ఒక పెద్ద హాస్పిటల్లో ఐసీయులో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని చావు బతుకుల మధ్య ఉన్నారు. మేం తలుపు అద్దంలోంచే ఆయన్ని చూశాం. రంగనాయకులు గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి. “మా తరం ఒక్కక్కరుగా వెళ్ళిపోతున్నాం," అన్నారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఓదార్చడానికి వయసు లేదు. డాక్టర్లని పరిస్థితి ఏంటని అడిగితే, ఇంకొన్ని గంటలు అన్నారు. "ఆ కొన్ని గంటలు వెయిట్ చేద్దాం ఫర్వాలేదా?" అని అడిగారు నావైపు తిరిగి. “ఏం పర్లేదు సార్,” అన్నాను తేలిగ్గా. మాలాగే అక్కడ చాలామంది ఉన్నారు. అందరూ లోపల ఉన్న ఆయన కోసం ఉన్నవాళ్ళే. “ఎవరు సార్ వీళ్ళంతా, బంధువులా?" అన్నాను.....................