బహుమతి
మర్నాడు ఆదివారమే కదా అని రాత్రి చాలా సేపు దాకా మేలుకొని చదువుతూ ఉండిపోయాను. శనివారం రాత్రి పడుకునేటప్పుడు గంట రెండు దాటి ఉంటుంది. ఎంత ఆలస్యంగా పడుకున్నా నిద్ర రావడానికి ఇంకో అరగంట అయినా పడుతుంది నాకు. అందువల్ల రెండున్నర తరువాతే నిద్ర పోయి ఉంటాను. హాయిగా నిద్ర పోతున్నప్పుడు వీపు మీద నాలుగైదు చేతులు వచ్చి నన్ను బలంగా కొట్ట సాగాయి. దెబ్బల వల్ల ఏర్పడిన బాధ కన్నా వాటివల్ల ఏర్పడిన చప్పుడు చాలా పెద్దగా ఉండింది. నిద్ర చెరిగిపోయి కళ్ళు తెరవక ముందే భుజంమీద చీమ కుట్టినట్లు అనిపించింది.
"నిద్ర ముఖం మామయ్యా!”
"గంట ఏడున్నర దాటింది.”
"లేస్తారా లేదా! గట్టిగా గిల్లనా!”
"నీళ్ళు తెచ్చి ముఖం మీద జల్లుతాము. ఇంకో రెండు నిమిషాల్లో లేవాలి మరి.” ఇలా పలు విధాలైన గొంతులు మాట్లాడుతున్నాయి. మాటల మధ్యలో ఇద్దరు ముగ్గురు ఒక్కసారిగా పడీ పడీ నవ్వారు. నేను కళ్ళు తెరిచి చూసాను.
"ఎవర్రా అది? ఇదిగో వస్తున్నాను. నిద్ర పోతుంటే వచ్చి..." అంటూ అదిలిస్తూ లేచి కూర్చున్నాను. ఒక్క పిల్లవాడు తప్ప, అంటే సారంగరాజన్ తప్ప, మిగిలిన పిల్లలందరూ విరగబడి నవ్వసాగారు.
"గడియారం చూడండి మామయ్యా! గంట ఎనిమిది అవుతోంది. నిద్ర ముఖం వాడిలాగా నిద్ర పోతూ..” అంటూ నవ్వింది చిత్ర.
అడిగాను.
"అది అలా ఉండనీ. తెల్లవారగానే ఈ దండు ఎలా ఇక్కడికి వేంచేసింది?" అని
"రాత్రుళ్ళలో చాలా సేపు మేలుకొని ఉంటే ఆరోగ్యానికి చేటు అని మా పాఠ్యపుస్తకంలో ఉంది మామయ్యా" అన్నాడు, ఇంత సేపూ మౌనంగా ఉన్న సారంగరాజన్..................