శ్రమజీవి
అనవసర న్యాయ వ్యాజ్యాల ద్వారా ధనమూ, సమయమూ వృధా చేసుకొని, తమ జీవితాలు పాడు చేసుకోవద్దనీ, తమ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలనీ తన కక్షిదార్లకు న్యాయస్థానంలో తీరిక లేకుండా ఉండే ఒక బారిష్టరు సలహా ఇచ్చేవాడు. తన తీరిక సమయాల్లో ఆయన హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్శీ బౌద్ధ మతాలకు చెందిన గ్రంధాలు చదివేవాడు. ఇంకా మేధావులు రాసిన అనేక పుస్తకాలను కూడా ఆయన చదివేవాడు. ఆ పుస్తకాల అధ్యయనం, అంతశ్శోధనల ఫలితంగా వ్యక్తులు కేవలం మేధస్సుతో పని చేస్తే చాలదనీ, ప్రతి మనిషీ ప్రతిరోజూ కొంతైనా శారీరక శ్రమ చేయాలనే విశ్వాసం ఆయనకు కలిగింది. అక్షరాస్యుడూ, నిరక్షరాస్యుడూ, వైద్యుడూ, న్యాయవాదీ, క్షవరం చేసేవాళ్లు, శుభ్రం చేసే వాళ్లు - అందరికీ వారి పనులకు సమాన వేతనం లభించాలి. ఈ విశ్వాసానికి అనుగుణంగా ఆయన నిదానంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. తన కళ్ళెదురుగా ఉన్న పనుల్లో పాలుపంచుకోవడం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు తన కుటుంబంతోనూ, స్నేహితులతోనూ కలసి ఒక ఆశ్రమంలో నిరాడంబర సామాజిక జీవనాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన యూరోపియన్ మిత్రులు కొందరు ఆ ఆశ్రమ జీవితంలో భాగం పంచుకోవాలనుకున్నారు.
ఎవరిమీదా ఆధారపడకుండా కష్టించి పని చేసే రైతుల్లా వాళ్ళంతా నేలను దున్ని, తోటలను పెంచుతూ జీవించడం ప్రారంభించారు. అక్కడ జీతానికి పని చేసే పనివాళ్ళెవ్వరూ ఉండేవారు కాదు. హిందువులు, ముస్లిములూ, క్రైస్తవులు, పార్శీలు, బ్రాహ్మణులు, శూద్రులు, కార్మికులు, బారిష్టర్లు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అంతా అక్కడ ఒకే పెద్ద కుటుంబంలో సభ్యుల్లా జీవించేవారు. అందరూ సమష్ఠి వంటశాలలో తయారైన భోజనాన్ని సమష్ఠి భోజనశాలలో తినేవారు. వారి ఆహారం సామాన్యంగానూ, వారి దుస్తులు ముతకగానూ ఉండేవి. ప్రతి సభ్యునికీ అతని నెలవారీ ఖర్చులకు 40...............