విశిష్ట కథల ప్రయాణంలోకి
ఆసక్తి రేకెత్తించే 'బల్కావ్' అనే పోర్చుగీసు భాషా శీర్షికతో, 'బ్యాక్ ప్యాక్ కథలు' అనే ఉపశీర్షికతో వెలువడుతున్న విశిష్టమైన ఈ పది కథల గుచ్చం ప్రధానంగా ప్రయాణ పరిమళాన్ని వెదజల్లుతున్నది. కథకురాలు చేసిన భౌతిక మానసిక ప్రయాణాల్లో బహిరంతర స్థల కాలాలు ఇచ్చిన కానుకలు ఈ కథలు. తనకందిన ఆ కానుకలను ఆమె కళాత్మకంగా కాల్పనీకరించి మన చేతుల్లో పెడుతున్నారు.
ఈ కథా సంపుటం శీర్షిక 'బల్కావ్' అంటే 'బాల్కనీ' అని అర్థం. భౌతికమైన బాల్కనీ ఉన్నవారికైనా లేనివారికైనా, మన ఇంట్లో మనం ఉండి ప్రపంచాన్ని చూసే స్థలం అనే అర్థంలో బహుశా ప్రతి మనిషికీ సన్నిహితమైనది. అది అంతరంగిక స్థలం. తాను బైటివారికి అందకుండానే బైటివారినందరినీ, దిగంతాల దాకా చూడగల స్థలం. అజ్ఞాత ప్రేక్షక స్థలం. ఉప శీర్షిక 'బ్యాక్ ప్యాక్' అందరికీ తెలిసిన పాత మూటకు, సామాన్ల సంచీకి, సూట్ కేసుకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆధునిక సాధనం మాత్రమే కాదు, బరువు మోస్తూనే మోయడం లేదనిపించేట్టు చేస్తుంది. మరొక పనికి ఉపయోగపడేలా రెండు చేతులనూ విముక్తి చేస్తుంది, అన్నిటికన్నా ముఖ్యంగా అది ఒంటరి ప్రయాణానికి, బాదరబందీ లేకపోవడానికి చిహ్నం. అది చేతులను విముక్తి చేయడం మాత్రమే కాదు, శరీరాన్నీ మనసునూ కూడా.................