అతనికంటే ఘనుడు...
అనే సాహితీ క్రికెటోపాఖ్యానము
“సూర్ సూర్, తులసీ శశి, ఔర్ ఉడుగన్ కేశవదాస్" నోరి దత్తాత్రేయ శాస్త్రుల వారి కంచు కంఠం ఆ చల్లని సాయంత్ర సంధ్య వేళ ఆహ్లాదకరమైన ఆ తోటలో మంద్రంగా మోగింది. బాపట్ల మాయాబజార్లో పెద్ద మేడ అది. అది భ్రమరాంబ గారి లోగిలి. భర్త వ్యాపారం పనులమీద వారంలో నాలుగు రోజులు మద్రాసులోనే ఉంటాడు. తక్కిన మూడురోజులూ బాపట్లలో అడ్వొకేట్లతో పేకాటలో మునిగి ఉంటాడు. భ్రమరాంబ గారు పరమ సాధ్వి. రాములవారి కళ్యాణం, దసరాలు ఆ వీధిలో మహా ఘనంగా జరిపిస్తుంటారు. ఆ మేడ తోటలో వారంవారం జరిగే “సాహిత్య కౌముది" సాహిత్య గోష్టులు మాత్రం ఆమె చలవవల్లే చక్కగా జరుగుతుంటాయి. ఆవిడకూడా ఒక శతకమేదో రాసిందని చెప్పు కుంటారు. అడపాదడపా వేరే పండితుల భాషణాలు జరుగుతూ ఉంటాయి గానీ నిలయ విద్వాంసుడు మాత్రం దత్తాత్రేయ శాస్త్రి గారే. అక్కడ చేరే సాహిత్యాభిమానుల ఆరాధ్య దైవం అతడే.
"ఈ నానుడికి అర్థం తెలుసా?” లీలగా నవ్వి, మీకెలా తెలుస్తుంది, నా శ్రాద్ధం, అనుకుని "నేను చెబుతా వినండి" అన్నాడు శాస్త్రి గారు. తన ఎదుట చిన్నబల్లపై ఉంచిన వెండిగిన్నెలో ఒక నేతిగారె అలవోకగా తీసి కొరుక్కుని, ఆబగా ఆత్రుతగా చూస్తున్న ఆడ మగ అభిమానుల మొహాలు చూస్తూ అన్నాడు, "హిందీ వాఙ్మయంలో సూర్యుడు సూర దాసు. చంద్రుడు తులసీదాసు, ఇకపొతే నక్షత్రం కేశవ దాసు, అని అర్థం." చిరునవ్వు మొహంతో చిద్విలాసంగా అందరినీ తేరిపారజూశాడు. అంతా కళ్ళు విప్పార్చుకుని, చెవులు రిక్కించుకుని చకోరపక్షులమల్లె చూస్తున్నారు.