గొడుగు కొండను అద్దంలో చూపిన సిమ్మన్న
భాష పండితుల చేతుల్లో ఉంటే ప్రయోజనం లేదని గుర్తించి దాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లాలనే దృఢ దీక్షతో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల భాషకు పట్టం కట్టిన భాషా యోధుడు గిడుగు వేంకటరామమూర్తి. తన జీవిత సర్వస్వాన్ని భాషకే అర్పించిన త్యాగశీలి గిడుగు. తెలుగు, సవర భాషలకు గిడుగు చేసిన సేవ అనన్య సామాన్యం. అనితర సాధ్యం. భాషా విక్రమార్కుడైన గిడుగు బహుముఖ సేవల్ని కొండను అద్దంలో చూపినట్లుగా సోదరులు ఆచార్య వెలమల సిమ్మన్నగారు ప్రయత్నించి సఫలులయ్యారని చెప్పటం సహజోక్తి.
తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి ఇప్పటికే 82పైగా గ్రంథాలు వెలువరించిన ఆచార్య సిమ్మన్నగారి కలం నుంచి జాలువారిన నవీన గ్రంథం "భాషా తపస్వి గిడుగు".
సిమ్మన్నగారు నిరంతర సాహిత్య అధ్యయనశీలి. అధ్యయనంతో తృప్తిపడే స్వభావం కాదాయనిది. అధ్యయనం చేసిన అంశాల్ని ప్రణాళికా బద్ధంగా ఒక చోట చేర్చి గ్రంథరూపంలో ప్రకటించే వరకు నిద్రపోని తత్వం ఆయనది. తనకు పింఛనుగా ప్రభుత్వం వారిచ్చే ధనాన్ని కొంత పుస్తక ప్రచురణకోసం వినియోగించే శారదా సమారాధకుడు సిమ్మన్న. అందుకు సహకరిస్తున్న వారి శ్రీమతి గారు, పిల్లలు అభినందనీయులు. సాహితీ వ్రతాన్ని నిష్ఠగా సలిపే సిమ్మన్నగారితో నాకు మూడు దశాబ్దాల పరిచయం. మేం ఏం రాసినా ఒకరికొకరం సంప్రదించుకోవడం మాకు అలవాటు. అందుకే సిమ్మన్నగారు రచించిన ప్రతీ రచనకూ, నేను రచించిన ప్రతీరచనకూ, ప్రథమ పాఠకులం మేమే. మాకు సేతువుగా ఆచార్య కొండపల్లి సుదర్శనరాజుగారు. రాజుగారి ప్రోత్సాహం మాకు కొండంత అండ
గిడుగు రామమూర్తి గారి మీద ఇప్పటికే చాలా గ్రంథాలు వచ్చాయి కదా! మళ్లీ ఇప్పుడు గిడుగును గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? అనే ప్రశ్న కలగటం సహజం. రామాయణాన్ని ఎంతోమంది రాశారు కదా అని విశ్వనాథవారు ఊరుకోలేదుకదా! తనదైన రచన తనది. అందుకే "ముఖే ముఖే సరస్వతి" అంటారు. ఎవరి ప్రతిభ వారిది. ఎవరి ధోరణి వారిది. ఎవరి మార్గం వారిది. కాబట్టి సిమ్మన్నగారు. తనదైన ముద్రను ప్రకటిస్తూ గిడుగు వారిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వీరు రచించిన గ్రంథాన్ని చదివితే వీరు తమ ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించారని చెప్పటం సముచితమన్పిస్తుంది..................