వినాయక చవితి.
పూజా మందిరం ముందు మనవళ్ళ పుస్తకాలు, పెన్సిళ్ళతో బాటు ఒక బౌండు పుస్తకం, కొత్త పెన్ను పెట్టాను. పుస్తకాలు అట్టల మీద, మొదటి పేజీలోనూ 'శ్రీ' అని పసుపుతో రాస్తోంటే మావారు, కొడుకు, కోడలూ పిల్లలూ వచ్చారు.
"ఈ లావు పుస్తకం ఎవరిదిరా" మా వారు అడిగారు.
“నీదా?! కొత్తగా ఈ అవతారం ఏంటోయ్. ఇంతకీ ఏం రాస్తావు, కథా? నవలా? నువ్వు మహా రచయిత్రివైపోతే ఇక నన్నంతా 'భానుమతి మొగుడు' అంటారేమోనోయ్!”
ఆయన నవ్వులాటకి అన్నా, నాకు మాత్రం చిరు సంతోషం, గర్వం కలిగాయి. కించిత్తు సిగ్గుగానూ అన్పించింది.
"బౌండ్ బుక్ని చూస్తోంటే ఖచ్చితంగా నవలే రాసి పడేసేట్టు వుంది. బయటి ప్రపంచం నీకేం తెలుసని ఏకంగా నవల రాయడానికి పూనుకున్నావమ్మా!" సుపుత్రుడి ముఖంలో, నవ్వులో వ్యంగ్యం కదిలింది.
"నిజమేరా. నాకు ఉద్యోగాలూ, కంప్యూటర్లూ, ఆఫీసులూ ఏమీ తెలీవు. అందుకనే నాకు తెలిసిన ప్రపంచం గురించే, నా గురించే రాద్దామనుకుంటున్నాను"
"కొంపతీసి ఆత్మకథ రాసేస్తావేంటోయ్" పెద్దగా నవ్వారు మా ఆయన.
"గృహిణిని. కొంప నిలబెడతాను గాని తీయను..” ఆయన మాటలు చురుక్కుమనిపించే సరికి ధీమాగానే జవాబిచ్చాను.
"నువ్వేమైనా రాణీ రుద్రమవా లేక ఏదైనా గొప్పది సాధించావా ఏకంగా ఆత్మకథ రాసేసి జనం మీదకి వదిలెయ్యడానికి!" అబ్బాయి ఎత్తి పొడిచాడు.
నేను తొణకలేదు. “వాళ్ళవేనా కథలు? మా అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు, ఆవేదనలు, ఆనందాలు కథకి సరిపోవా?"....................