బతుకు
వరుసగా ఉన్న కొండల పైన ముఖానికి ఎవరో రంగుపూస్తున్నట్లుగా ఆకాశం ఎర్రబడుతోంది. చల్లగా వీస్తూ మెల్లగా ధ్వనిస్తూ అడవి గాలి ఆ కొండలను చల్లబరచి, తాటితోపులోకి సాగింది. చూస్తూ వుండగానే మేఘాల ముఖంలో ఓ పక్క పసుపురంగు, మరో పక్క కాషాయ రంగు, ఇంకొక పక్క బంగారు రంగు కలిసినట్టుగా వెలుతురు పుట్టి చేతులు కాళ్ళు విదుల్చుకుంటోంది. నల్లటి మేఘాల సందుల్లో నుంచి చేతులు కాళ్ళు చాస్తూ వెలుగు బలుస్తూ, కొండలపైనున్న చెట్లు తలపై బంగారురంగు చిలకరిస్తూ, అలా నెమ్మదిగా క్రిందకు జారి కొండ పాదాలకు ఆనుకొని ఉన్న శివళ్ళి గ్రామంలో ఇళ్ళు, గుడిసెల పైన చల్లగా వ్యాపిస్తోంది. రాత్రంతా కొండపై నున్న చెట్లు చేమల మీద తమ ఆకారాలను ముడుచుకొని పడుకొన్న రకరకాల పక్షులు కువకువలాడుతూ ఎగరటం ప్రారంభించాయి. ఎగరలేని పక్షులు పిల్లలు గూళ్ళ చివరిదాకా పాకుతూ చిలిపిలిమంటూ కళ్ళు ఆర్పుతున్నాయి. రెక్కలు బలుపెక్కిన పక్షులు గుంపుగా ఆకాశపు ఎద పైకి ఎగరడం ప్రారంభించాయి.
కాలువ గట్ల, చెట్లపైన గుడ్లగూబలు యథాప్రకారం తమ వికార ధ్వనిని వినిపిస్తున్నాయి. దానికి పక్కలో ఒత్తుగా ఏర్పడి సంవత్సరంలో పన్నెండు నెలలూ పచ్చగా ఉంటూ, అలసిన తాటి తోపులో ఈడిగ జాతి నివసించే ప్రాంతంలో కోళ్ళ, కుక్కల, పిల్లల ఏడుపు కలగలిసి పోయిన ధ్వని సన్నగా వినబడుతోంది. వీటిని పట్టించుకోకుండా కాలువ పైన లేత ఎండ ఎప్పటిలాగా యథాప్రకారం సాగిపోతోంది. కాలువ పక్కన కాలిబాటను దాటి తాటితోపు వైపు బయలుదేరిన జమాచార మల్లప్ప దూరంలో చెట్ల మధ్య వున్న ఈడిగ సాంబయ్యను పిలిచాడు. "సాంబయ్య!.... ఓ.... సాంబూ...!" పిలుపు విన్న సాంబయ్య తిరిగి చూశాడు. పచ్చ అంచు ధోవతి, బుర్రమీసాలు, వ్యాయామం చేసిన శరీరంతో వస్తున్న శివళ్ళి గ్రామం జమాచార మల్లప్పని చూసి -
"నమస్కారం దొరా! గిదేంది? ఇంత పొద్దుగల లేచి గిట్లొస్తన్నవ్?" అంటూ దగ్గరకొస్తూ అడిగారు “పొద్దెక్కిందంటే మీరు, తోపులో అందరూ తాటి కల్లుకి నీరు.................