బీదల పాట్లు మొదటి పర్వం
ఫ్రాన్స్ దేశంలో అది డి - పట్టణం. ఆ పట్టణంలో క్రైస్తవ మఠానికి పీఠాధిపతి మైరియల్. ఆయన వయస్సు 75. ఆయన పూర్తి పేరు చార్లెస్ ప్రాన్ కొ బియావెన్ మైరియల్. ఆయన గురించి ప్రజలు తరచూ ముచ్చటించుకుంటూ ఉంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రవర్తన ఎంతో దయాపూరితంగా ఉంటుంది. మతసూక్తులను ఒంట పట్టించుకుని ఆచరణలో పెట్టే మహానుభావుడు మైరియల్.
ఆయన తండ్రి కూడా ప్రముఖుడే! స్థానిక విధానసభలో తండ్రి ఒక సభ్యుడు. తన కొడుకు కూడా విధానసభాసభ్యుడు కావాలని ఆయన ఆశించాడు. అటువంటి ఉద్దేశ్యంతోనే మైరియల్కు ఇరవయ్యో సంవత్సరం వయస్సు రాకముందే పెండ్లి చేయాలని భావించాడు తండ్రి. పెండ్లి సంబంధాలు వచ్చే సందర్భంలో మైరియల్ ఆటే పొడగరి కాదని గుసగుసలు ఎదుర్కొన్నాడు. పొడవు తక్కువైనప్పటికీ శారీరక దృఢత్వం కలిగిన వ్యక్తి మైరియల్. యవ్వనపు తొలి వెలుగులు అతడి శరీరంలో ప్రత్యక్షమయ్యేవి. శుచికరమైన అలవాట్లు అతడి సొంతం.
పెండ్లి జరిగింది. అతడు సంసార జీవితంలో పూర్తిగా ఇమిడిపోయాడు. ఫ్రాన్స్ దేశంలో విప్లవం చెలరేగింది. ఫ్రాన్స్లో అంత కాలం పాటూ సుఖలాలసులుగా బతికిన ఎన్నో కుటుంబాలు విప్లవకారులు బారిన పడ్డాయి. ఆ కుటుంబ సభ్యులను ఊచకోత కోశాయి విప్లవ సేనలు. చాలా కుటుంబాలు నాశనమైపోయాయి. ముందే మేలుకున్న కుటుంబాలు కొన్ని వలస వెళ్లిపోయాయి. ఇటలీలో ఫ్రాన్స్ వాసులు తల దాచుకున్నారు. ఇదిగో, ఇదే క్రమంలో మైరియల్ కూడా భార్యా సమేతుడై ఇటలీ దేశం చేరుకున్నాడు.
ఫ్రాన్స్ దేశం అతలాకుతలమైపోయింది. దేశంలో ఎక్కడ చూసినా రక్తపాతమే! మైరియల్ భార్యకు సంతానం కలగలేదు. పైగా ఆమెకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి.....................