ఒకటి
బాతా నగరంలోని ఆ చిన్నపోలీస్ స్టేషన్ ముందు నేనూ, హమీద్ కొద్దిసేపటినుండి పరాజితుల్లా నిలబడ్డాం. గేటుదగ్గర ఉన్న సెంట్రీబాక్స్ లో ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. ఒక పోలీసేమో ఏదో పుస్తకం చదువుతున్నాడు. అతను కూర్చున్న భంగిమ, తల పంకిస్తున్న విధానం, అరమోడ్పులైన కన్నులు చూస్తుంటే ఏదో మతగ్రంధం చదువుతున్నాడని అనిపిస్తోంది. రెండో పోలీసేమో ఫోన్లో బిగ్గరగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతని సంభాషణా, మధ్యమధ్యలో అతని నవ్వులూ వీధి చివరివరకూ వినిపిస్తున్నాయి. పక్కపక్కనే కూర్చున్నా వాళ్లిద్దరూ వేర్వేరు లోకాల్లో ఉన్నారు. వారున్న లోకాలేవీ మాబోటివాళ్లను పట్టించుకునేవి కావు!
సెంట్రీబాక్స్కు కొద్ది దూరంలో రోడ్డు మీదికి వంగి ఉన్న అడవినిమ్మ చెట్టు నీడలో మేమిద్దరం కూర్చున్నాం. ఇద్దరు సెంట్రీల్లో ఎవరో ఒకరు మమ్మల్ని చూడకపోతారా అని మా ఆశ. కానీ ఎంతసేపు అలా వేచిచూసినా మా ఆశలు అడియాసలే అయ్యాయి.
మేమలా ఎదురుచూస్తుండగానే ఒకరిద్దరు అరబ్బులు స్టేషన్ లోపలికి వెళ్లారు. కనీసం ముగ్గురు నలుగురైనా స్టేషన్ నుండి బయటికి వచ్చారు కూడా. మేం మాత్రం వాళ్లెవరి కంటికీ కనపడనట్టే ఉంది. ఇంతలోనే స్టేషన్ కాంపౌండ్ నుండి ఒక పోలీస్ వాహనం బయటికి వచ్చింది. మేము దిగ్గున లేచి నిల్చుని ఆ వాహనం వైపు ఆశగా చూశాం. కానీ రోడ్డు దాటే ముందు ఏమైనా వాహనాలు వస్తున్నాయో లేదో అని అటూఇటూ చూసి తన వాహనాన్ని ముందుకు పరిగెత్తించాడా డ్రైవర్. మేము నిరాశగా ఆ చెట్టుకు జేరగిలపడిపోయాం.
ఫోన్ మాట్లాడుతున్న సెంట్రీగార్డు కాల్ ముగిసిన ప్రతీసారి మేము లేచి ఆ సెంట్రీబాక్స్ వద్దకు ఆశగా నడిచేవాళ్లం. కానీ అతను మాత్రం మరుక్షణం ఇంకో నెంబర్ డయల్ చేసేవాడు. ఇక రెండో సెంట్రీ అయితే తదేకంగా చదువుతున్న పుస్తకంలోనే................