ప్రస్తావన
ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా ఉంటుందో, తక్కినవారు గ్రహించలేరు. వారి జీవితపు నడక పద్ధతి కూడా భేదంగా వుంటుంది. అంతేకాదు, ఆ జ్ఞానులలోనే, ఒకరి జీవిత పద్ధతి, వారు బోధించే సాధనా పద్ధతీ ఒకరినుంచి ఇంకొకరికి వేరుగా వుంటాయి. వారిలో కొందరు మనుష్యుల మధ్య వుండిపోయి, ఆశ్రమాలలో నివసించి, శిష్యుల్ని తయారుచేస్తారు. కొందరు నిలకడ లేకుండా తిరుగుతూ వుంటారు. కొందరు పాడతారు. కొందరు వాదిస్తారు, కొందరు బోధిస్తారు. కొందరు మౌనులు. కొందరసలు కంటికి కనపడరు. కొందరు రొష్టుపడి, ప్రజల ఆగ్రహం వల్ల కంటక బడతారు. కాని వారికి కంటకం అంటదు. ఒకేమాట మాట్లాడి, ఒకే చర్య చూపినవారే కొందరు పూజనీయులై, చివరివరకు మన్ననలందుకుంటారు. కొందరు నిందపడతారు.
విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది. కాదనీ, వారి మాటలు, చేతల, ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. వారి చుట్టూ ఏం జరిగినా, వారికేం జరిగినా వారికి అంటదు. వారు మనుషులకి అర్ధంకారు. ఎందుకంటే, మనుషులు మనసులతో ఆలోచించి చేస్తారు. అందువల్ల ఒకరికొకరు కొంతవరకన్నా అర్థమవుతారు. కాని ఈ జ్ఞానులకు మనోనాశనమవుతుంది. అందువల్ల వారి నడకలే వేఱు. వారి జీవిత సందర్భాలలో, సంబంధాలలో పరస్పర విరుద్ధాలెన్నో కనపడతాయి. వారి పనులలో కొన్నింటికి కారణాలు వున్నట్లు కనపడ తాయి. కొన్నింటికి కనపడవు. పిచ్చివాడి పనులలాగో, పొగరెక్కి నిరంకుశు...................