సంస్కృతి
(Culture)
సంస్కృతి అన్నమాట విశాలమైన భావనతో వాడబడుతున్నది. సంస్కరించబడినది లేదా సుందరమైన ఆకృతి కలిగినటువంటిది అన్నవి ఈ శబ్దానికి స్థూలంగా వచ్చే అర్థాలు. దానికి సమానార్థకంగా ఆంగ్లంలో వచ్చే Culture అన్నపదం Cultivation అన్నదాని నుండి వచ్చినట్లుగా చెప్పుతారు. Cultivation అంటే? ఫలవంతమైన కృషి అని కదా! మానవ జీవితాన్ని ఫలవంతం చేసి జీవజాలంలో మానవుని ఔన్నత్యాన్ని పెంచుటకు ఉపయోగపడే దానిని సంస్కృతి లేదా Culture గా చెప్పుకోవచ్చును. ప్రకృతిలో మనకు ముడిపదార్థంగా లభించే దానిని సంస్కరించిన తర్వాతనే మనం వాడుకొంటున్నాం. సంస్కారం చేతనే ఒక వస్తువు యొక్క విలువ పెరుగుతుంది. " ఒక మామూలు శిలకు విగ్రహానికి ఉండే విలువలోని తారతమ్యం మనకు తెలియును. అట్లే మిగిలినవి కూడా.
మానవ జీవితంపై అపారమైన ప్రభావాన్ని చూపునట్టిది సంస్కృతి. ఒక జాతి యొక్క విజ్ఞానం, కళలు, విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు, నైతిక దృక్పథాలు, జీవనవిధానం మున్నగువాని సమిష్టి సంపదయే సంస్కృతి. వివిధ భౌగోళిక పరిసరాలలో జీవిస్తున్న మానవ సమాజాలు తమ మనుగడకోసం, వికాసం కోసం, సంపూర్ణత్వ సాధనకోసం తామున్న స్థితి గతుల కనుకూలమైన సంస్కృతులను సృజియించుకొన్నవి. సంస్కృతి చైతన్య వంతమైన పురోభివృద్ధికి సంకేతం. అది పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసమునకు తోడ్పడునట్టిది. వ్యక్తి దృక్పధాలలో ఆసక్తులలో స్పష్టత పెంచి సాంఘిక జీవనం యొక్క ఔన్నత్యమునకు తోడ్పడునట్టిది, నిత్యజీవితంలోను చేసే పనులలోను సత్య దృష్టిని, సభ్యతను ఆనందదాయకమైన విధానమును పెంచునట్టిది సంస్కృతి. సంస్కృతి అంటే? కేవలం భాషా జ్ఞానమో, విషయజ్ఞానమో అసలేకాదు. పుస్తక సంస్కృతి..........................