శ్రీ మహమ్మేరు సమానధీరులైన ...
శ్రీమత్ సకలగుణ సంపన్నులు, విద్వజ్జనులు, అపూర్వభిషక్కులు, శాంతిప్రపూర్ణులు, శ్రీ మహమ్మేరు సమానధీరులైన శ్రీమత్ కాకర్లపూడి వేంకట విజయగోపాలరాజు బావగారి దివ్యసన్నిధికి.. ఉప్పలపాటి అప్పలనరసింహరాజు మ్రొక్కి చాయంగల విన్నపంబులు ...
స్వస్తిశ్రీ నందననామసంవత్సర చైత్రశుద్ధ చవితి స్థిరవారంనాడు తమకు సుపుత్రోదయమైనది. సింహగిరి శ్రీవరాహలక్ష్మీ నృసింహుని దయవలన తల్లీబిడ్డలిద్దరూ క్షేమము. ఈ శుభలేఖార్ధములు తమకు తెలియజేయుటకు మిక్కిలిగా సంతోషించుచున్నాము.
చిత్తగించవలెను.
ఇట్లు
తమ
బుచ్చి బావమరుదులుంగారయిన ఉప్పలపాటి అప్పలనరసింహరాజు
మహారచయిత, మానవతావాది, ఆధునిక తెలుగు సాహితీరంగాన్ని మెరిపించి, మురిపించిన శ్రీ కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి పుట్టినప్పుడు వారి మాతామహుల ఇంటినుంచి ఆయన తండ్రిగారికి అచ్చం ఇలాంటి పుట్టుశుభలేఖార్థములే బయల్వెడలవలసి ఉంది. రాచకుటుంబాలవారి ఆచారాల ప్రకారం ఇంత పద్ధతిగానూ, ఇంతటి సంప్రదాయబద్ధంగానూ తరలివెళ్లవలసి ఉంది. కాకపోతే, అలాంటి జాబు అంచె బళ్లమీద ఖణాయించాలంటే పతంజలి జనకులు శ్రీ వేంకట విజయగోపాలరాజుగారు వేరే ఊరిలో ఉండాలి కదా. ఆయన అలా లేరు. పతంజలి తండ్రిగారి ఊరు, తల్లికి పురుడుపోసిన అమ్మమ్మ ఉండే గ్రామం ఒక్కటే. అది అలమండ. అందుచేతను, రెండిళ్లవారూ దగ్గర దగ్గర గడపల వారే కావడం వల్లనూ, గోపాలరాజుగారు ఆధునికత ఒంటబట్టించుకున్నవారైన కారణంగానూ అలాంటి ఉత్తరాలకు తావులేకుండా పోయింది. ఆ రకంగా ఫక్తు సుక్షత్రియవంశంలో పతంజలి పుట్టినప్పటికీ అసలు సిసలు ఆచారాలు ఆయన పెంపకంలో పెద్ద పాత్ర పోషించలేకపోయాయి. అలా అని ఆ కాలానికి అవన్నీ సంపూర్ణంగా సమసిపోయాయనీ చెప్పలేం.
పతంజలి భూమ్మీదపడినప్పటికి రాచరికాలు తెరవెనక్కి మళ్లినా, వాటి జాడలు ప్రబలంగానే ఉన్నాయి. జమీందారీలు అంతమైనా, వాటి జలతారు నీడలు స్ఫుటంగానే..............