భాషా పరిమళాలు
తెలుగుభాష ఆధునికం అవుతున్న కొద్దీ పాత నుడికారాలు, సామెతలు, పలుకుబడులు, జాతీయాలు మొదలయిన భాషాలంకరణ సామాగ్రికి వాడుక తగ్గుతున్నట్లున్నది. అందువల్ల భాషకు సంప్రదాయ సుగంధం కొరవడుతున్నది. ఆహారానికుండే రంగు, రుచి, వాసనవల్ల తినేవారికి ముందుగానే నోరూరినట్లు, నుడికారం కలసినభాష వినేవారి మనసూరుతుంది. అభిప్రాయ వినిమయమే భాషకు మొదటి ప్రయోజనమయినా, నుడికారాలు భాషకు సహజ అలంకారాలు. గ్రంథంలోని రచనాశిల్పానికి రచయిత ఒక్కరే. భాషను సొంత ఆస్తిగా చేసుకున్న వ్యవహర్తలు తరతరాలుగా సమిష్టి సంపదగా కూర్చిన అలంకారాలు ఈ జాతీయాలు.
ఇది సమిష్టి సంపదే అయినా దాని వినియోగానుభవం రానురాను తగ్గుతున్నది. వస్తున్న ఈ మార్పును, వాటిని భద్రపరచవలసిన అవసరాన్ని మిత్రుడు వల్లూరు శివప్రసాద్ గుర్తించాడు. అనూచాన నిఘంటువులలో ఇవి కనుపించటం లేదు. కనుక ఈ అవసరాన్ని గుర్తించి నా చెవిన వేసాడు. ఇది మంచి సంకల్పం అనిపించి నా మనసుకు స్ఫురించిన మేరకు సేకరించాను. ఇంకా చాలా ఉండి ఉంటాయి. ఇది అసమగ్రమే.
ఇదేకాదు, నిజానికి ఏ ప్రయత్నము సమగ్రం కాదు, ఒక్క శూన్యత తప్ప. శూన్యత ఒక్కటే సమగ్రం. భాషాప్రవాహం ఎప్పటికీ, ఎక్కడా ఆగేదికాదు. అనేకమంది తరతరాలుగా ఆ కృషికి దోహదం చేసుకుంటూ.. ఇంకా ఇంకా సమకూర్చుకుంటూ ఎప్పటికీ చేరలేని సమగ్రత వైపుకు నడవాలి. భాషలో ఉన్న అనేకాంశాలలో ఇందులో ఉన్నవి రెండు మాత్రమే.
ఇందులోని మొదటి భాగంలో పురాణగాథలు, పూర్వ సాహిత్యం ఆధారమైన పాత్రలు, సంఘటనలను సూచించే పదాలను చేర్చాను. అవన్నీ దోసెడు భావానికి చిటికెడు సంకేతాలుగా నిలబడిపోయే పదాలు. పూర్వ సాహిత్య పరిచయం తగ్గుతున్న కొద్దీ ఆ దోసెడుభావం ఏమిటో రేపటి తరాలకు తెలిసే అవకాశం రానురాను తగ్గుతున్నది. కనుక వాటిని వివరించి చేర్చి పెట్టటమే ఈ ప్రయత్న లక్ష్యం.
ఇందులోని పదాలలో కథాసందర్భానికి సంకేతమైనవి కొన్ని (లక్ష్మణరేఖ, అగ్నిపరీక్ష, ససేమిరా మొదలైనవి), నిర్దిష్ట స్వభావానికి సంకేత పాత్రలు మరికొన్ని (బకాసురుడు, ఆషాఢభూతి, ప్రవరుడు మొదలైనవి), సామాజికాలు ఇంకొన్ని (ద్రావిడ ప్రాణాయామం, చిదంబర రహస్యం, చేతి చమురు భాగవతం, నియోగిముష్టి మొదలైనవి).
పదాలు ప్రధానంగా రామాయణ, భారత, భాగవతాల నుండి తీసుకొన్నాను. కొన్ని కావ్య సాహిత్యం నుండి తీసుకొన్నాను (నిగమశర్మ, కరటక దమనకులు వంటివి).
వివరణ పద్ధతి: మాటను పేర్కొని దానికి సాధారణ వినియోగంలోని అర్ధం చెప్పటం, తర్వాత ఆ మాటకున్న కథాసందర్భం, పాత్ర స్వభావం, ఆ పదాన్ని వాక్యంలో ఉపయోగించి చూపటం. ఉదాహరణ వాక్యాలను సమకాలీన సందర్భంగానే వ్రాసాను...............