అధ్యాయం - 1
ఉపోద్ఘాతము
అన్ని కాలాలలోను, అన్ని దేశాలలోను ఏ ఇతర అంశం మీద జరగనటువంటి చర్చ విద్య పై జరగడమనేది వాస్తవం. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి, సక్రమమైన, సమర్థవంతమైన, నాణ్యమైన విద్యను యువతరానికి అందించాలనే తపన ఎన్నదగినది. అయితే ఈ ప్రక్రియలో ప్రతి దేశము అనేక చిక్కుముడులను ఎదుర్కొంటున్నది. కొన్ని మౌలికమైన ప్రశ్నలకు శతాబ్దాల తరబడి జవాబులు లభించడం లేదు. మూలాలను తరచి చూస్తే, విద్య అంటే ఏది, దాని లక్ష్యం ఏమై ఉండాలి, దానిని ఎవరు ఏ విధంగా బోధించాలి, కాలానుగుణంగా మార్పులను ఎలా చొప్పించాలి వంటి ప్రశ్నలు నిరంతరం అడగబడుతూ, చర్చను అపరిష్కృతంగాను, సుదీర్ఘంగాను చేస్తున్నాయి. ఒకవిధంగా చూస్తే, వీటిలో ఏ ఒక్క దానికి అంతిమ జవాబు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఇదే పరిష్కారమని ఎవరైనా సూచించినా, అది తాత్కాలికమే అవుతుంది. అనాది కాలం నుండి ఏకాభి ప్రాయానికి రాని, రాలేని ఏకైక అంశం విద్య.
మొదటిగా విద్య అంటే ఏది అనే అంశాన్ని స్పృశిస్తే అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల దృక్పథాల మధ్య విపరీతమైన తేడా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలపరంగా చూస్తే, శాస్త్ర, సాంకేతిక అంశాలపరంగా ప్రకృతిపై విజయం సాధించడమే విద్య యొక్క పరమావధిగా నేడు చెప్పబడుతున్నది. ఈ శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి అంతా 18వ శతాబ్దంలో ఏర్పడిన 'పారిశ్రామిక విప్లవం' తరువాత ప్రాముఖ్యంలోనికి వచ్చిందే. జనవరి 19, 1736లో స్కాట్లాండ్లో జన్మించిన జేమ్స్వాట్, 1786లో అంతకుముందు 'ఆవిరి యంత్రం' పై పరిశోధన చేసిన థామస్ సేవరి (1698), థామస్ న్యూకోమెన్ (1712)ల ఫలితాలను మెరుగుపరచి యంత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆవిధంగా పారిశ్రామిక విప్లవానికి ఈ ఆవిరియంత్రం పరిశోధన, నిర్మాణం గొప్ప ఛోదకమని చెప్పవచ్చు. ఆపైన....................