తొలికథల బంగారం - మలికథల భూమి
గత పదిహేనేళ్ళుగా రెడ్డి రామకృష్ణ కవి, గేయ రచయితగా బాగా తెలుసు. ముప్ఫై ఏళ్లుగా ఇటువంటి కథలు కూడా రాస్తున్నట్లు, అవి సంపుటి కాదగినన్ని ఉన్నట్లు, పుస్తక ప్రయత్నం మొదలైనపుడు తెలిసింది. ఏడెనిమిదేళ్ళ కిందట అనుకుంటాను. కొన్ని చిన్నకథలు, ప్రచురణ కానివి, నేను చదవడం కోసం రామకృష్ణ పంపారు. ఆ కథల్లో ఏడెనిమిదేళ్ళ వయసున్న ఒక బాలుని జీవన కథనాలు ఆకట్టుకున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని దిగువ మధ్యతరగతి సుఖదుఃఖాల హరివిల్లు ఆ కథల మీద అలవోకగా వొంగింది. అనుభవించి, పలవరించిన జీవితాన్ని ఒకసారి వల్లె వేస్తే చాలు, దానంతట అది సాహిత్య కళగా అనువర్తితమవుతుందని ఆ కథలు నిరూపించాయి.
ముందుమాట కోసం కథలు పంపుతున్నానని చెప్పినపుడు, 'బాల్యపు కథలా?' అని సంబరంగా అడిగాను. 'అబ్బే అవేం కథలండీ! అవి కాదు, ఇవి సీరియస్ కథలు' అనేసారాయన. అపుడే ఆయన మాటని గట్టిగా ఖండించాను. ఉత్తరాంధ్రలో తమ చిన్నతనం నేపథ్యంగా కథలేమన్నా వచ్చాయా అంటే ఆయన రాసిన సమయానికి అయితే ఏమీ లేనట్లే. ఒకటీ అరా ఇటీవలి కాలంలో తప్ప అంతకు ముందు ఒక సీరీస్ గా కథలు వచ్చిన గుర్తు లేదు. రామకృష్ణ బాల్య జ్ఞాపక కథలను తప్పకుండా పుస్తకం తేవాలని చెప్పాను. వాటిని పక్కన పడేస్తారన్న అనుమానం ఇంకా ఉండడం వల్ల సాహసించి, ఈ ముందుమాటలో వీటిని ప్రస్తావించాను.
మన జ్ఞానానికి అనుగుణంగా రచన చేయడంకన్నా మన అనుభవానికి ఋణపడి రచన చేస్తే కళాత్మకమవుతుందని గుర్తుచేసే రచనలు చదవడం బావుంటుంది. అందరూ అన్ని సందర్భాల్లోనూ అటువంటి రచనలు చేయలేకపోవచ్చు. స్వానుభవాలు పలికినంత బలంగా సహానుభవాలు పలకలేకపోవచ్చు. కానీ హృదయగతమైన నిజాయితీని నిపుణులైన పాఠకుల కన్ను గుర్తిస్తుంది. అటువంటి నిజాయితీకి కొరత లేని కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.
మొత్తం కథలని ఒకే చోట, ఒకే విడతలో చదివినపుడు స్పష్టంగా ఒక విభజన రేఖ కనపడుతుంది. 2012 కాలానికి ముందున్న కథలు, ఈ పదేళ్ళ కథలు. ఈ విభజన వస్తువుని బట్టి వచ్చిందా, శిల్పాన్ని బట్టి వచ్చిందా అంటే బహుశా....................