పూర్వరంగం
స్వాతంత్ర్య సముపార్జన తరువాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు రూపొందించి, ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పేదరికం సంపూర్ణంగా నిర్మూలనం కాలేదు. దోపిడీ విధానం కొనసాగుతూ వచ్చింది. బలహీనవర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి, అస్పృశ్యతా పిశాచ నిర్మూలనకు, సమ సమాజ నిర్మాణానికి ఎన్నో కార్యక్రమాలు అమలు జరిగినవి. గత నలభై అయిదు సంవత్సరాల కాలంలో ఎన్నో చట్టాలు రూపొందించి సాంఘిక అసమానతలను, సంఘ దురాచారాలను తొలగించటానికి ఎంతో కృషి జరిగినప్పటికీ ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.
ఎందరో సంఘ సేవకులు, సమాజ సేవా కార్యకర్తలు ఈ ఉద్యమాలలో నిమగ్నులై కృషి చేస్తూ ఉన్నారు. వారి నిరంతర ప్రయత్నం, కార్యదక్షత వల్ల నిమ్నజాతులు, బలహీనవర్గాల వారిలో చైతన్యం కలిగి, వారు అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నప్పటికీ ఈ విషయంలో సాధించవలసింది ఎంతో ఉంది. సమ సమాజ రూపకల్పన ఉద్యమ లక్ష్యం నెరవేరలేదు. నిరంతరంగా కొనసాగుతున్న ఈ ఉద్యమానికి ఉజ్వల ప్రతీక ఈశ్వరీబాయి.
ఆంధ్రప్రదేశంలో సంఘ దురాచారాలు, స్వార్థపరశక్తుల అమానుష కృత్యాలు, గ్రామ పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం జరిపి, అణగారిన ప్రజల అభ్యున్నతికి, వారి న్యాయమైన హక్కులు, అధికారాల కోసం పోరాడి అనేక విజయాలు సాధించిన సంఘ సేవా పరాయణురాలు, నాయకమణి ఆమె. బలహీన వర్గాల, దళిత జనుల, పీడిత ప్రజల ఉద్ధారకురాలు శ్రీమతి జె. ఈశ్వరీబాయి.
భారత జాతీయ నాయకులలో అగ్రగణ్యుడైన బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు, సిద్ధాంతాలకు, కార్యక్రమాలకు అంకితమై, ప్రజాసేవలో ఆహోరాత్రులు నిమగ్నురాలై, ఆశేష ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ప్రజా నాయకురాలు ఆమె..................