భూదేవి బిడ్డల వలపోత మాది
ఇది కథ కాబట్టి భూదేవి చావుతో ఇంకొంత ఆశ మిగిలే ఉంది. పెద్దంపేట గ్రామస్తుల డిమాండ్లు తీరాతాయేమోనన్న ఆశ అది. కానీ నిజం మాత్రం అలా కొనసాగింది మా ఊరినీ, మా ఊరి చెరువునీ మింగింది, కట్టమీది మైసమ్మా, గట్టుమీది అంజన్నా కూడా తమ గుళ్లని కూల్చుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు పెద్దంపేట గ్రామపంచాయితీలోని మంగలిపల్లె అనే గ్రామం కనపడదు. ఆ ఊరు మైదానం ఆయింది, రేపు అక్కడ లోయ ఏర్పడబోతుంది. ఆ ఊరి నిర్వాసితులైన మా బతుకుల్లాగే భూమిని కూడా తవ్విపోస్తారు, మా జీవితాలని పీల్చినట్టే అక్కడ బొగ్గును ఎత్తుకుపోతారు.
ఆ మంచినీళ్ళకోసం అక్క రెండు కిలోమీటర్లు నడిచి నీళ్లు మోసుకొచ్చేది, తర్వాత సైకిల్ క్యారియర్కి రెండుపక్కలా రెండు ప్లాస్టిక్ క్యాన్లు కట్టుకుని నీళ్ళు తెచ్చినం. 11ఏ మైన్ గోడలల్లనుంచి సంచుల్లో బొగ్గు ఏరేదానికి పోయినం. ఆ బంకర్ల మీదకి ఎక్కినం. ఇంతపెద్ద బొగ్గుబాయి మా ఊరు పక్కనే ఉన్నదని గర్వంగా చెప్పుకున్నం. ఇప్పుడు అదే బొగ్గుబాయి పెద్దనోరు తెరిచి ఓపెన్ కాస్ట్ అయి మా ఊరినీ, మా జీవితాలనీ మింగేస్తే నిర్వాసిత జీవితాలమీద ఒకనాటి గాయాల గతాన్ని మోస్తున్నం. వాళ్ళ కోడిలెక్కల నష్టపరిహారాలతో బాగుపడ్డ వాళ్ళెవరూ లేరు. ఉన్న కాస్త భూమి, ఇళ్ళూ పోగొట్టుకొని ఎక్కడెక్కడో చేరిన............