"ఏ కవికయినాసరే అతనిచుట్టూ ఒక సమాజము ఆ సమాజానికొక చరిత్ర ఆ చరిత్ర కొక పరిణామం వుంటాయి. సామాజిక, చారిత్రక పరిణామ గమనంలో సాహిత్య స్థానం నిర్ణయమవుతుంది. కవి ప్రగతిశీలీ. ప్రతిభాశీలి అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు" అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. సామాజిక పరిణామానికి దోహదం చేసిన విప్లవ కవి రచయిత భూషణం.
రచయితకు దృక్పథాన్ని అతని జీవిత నేపథ్యమే ఏర్పరుస్తుంది. భూషణం దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఆకలే ఆదిగురువు అన్నట్టు పాఠశాలలో అడుగుపెట్టక ముందే జీవిత పాఠశాలలో పేదరికమే పెద్ద గురువై చాలా నేర్పింది. తాను జీవితంలో అనుభవించిన కష్టనష్టాలకు ప్రపంచంతో పంచుకోడానికి రచనా ప్రక్రియను మాధ్యమంగా చేసుకున్నాడు. దాంతో ఆయనకు సమాజంతో ఒక సజీవ సంబంధం కుదిరింది.
లోకంలో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకారణ సంబంధాన్ని పరిశీలించే పనిలో భాగంగానే ఆయన రచనా ప్రక్రియ సాగింది. ఆయన పుట్టి పెరిగిన ఊరు దాటక పోయినా, ఉత్తమ సాహిత్య అధ్యయనం ద్వారా, ప్రజాసాంస్కృతిక సంఘాలలో క్రియాశీల కార్యకర్తగా పనిచెయ్యడం ద్వారా లోకం పోకడని అంచనా కట్టగలిగాడు.
పుట్టిందీ పెరిగిందీ జీవిక కోసం జీవిత పర్యంతం నివసించిందీ స్వగ్రామమే. దాని కేంద్రంగానే సహజంగా పల్లెల్లో ప్రస్పుటంగా కనిపించే ఫ్యూడల్ భావజాలం, దాని అవలక్షణాలు ఆధారం చేసుకునే ఆయన రచన సాగింది. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తరువాత టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన బాధ్యుడిగా వుండడం రచయితగా ఆయన బాధ్యతనీ మరింత పెంచింది. ఉపాధ్యాయుల వెట్టిచాకిరీ, చాలీచాలని, సమయానికి అందని జీతాలు, పెద్ద కుటుంబాలతో పడే ఇక్కట్లు, ఈ నేపథ్యంలో ఆయన మొదటి కథా సంపుటాలు, 'న్యాయం', ఏది సత్యం ఏదసత్యం, సాలెగూడు, కొత్త పంతులు వంటి నాటికలు రాసారు. 'కొత్త సృష్టి' కవిత్వం కూడా ఈ కాలంలోనే వచ్చింది....................