ద్వితీయ కళత్రం
నేనేపొరబడ్డానా? లేక నిజంగా అలా జరుగుతుందా? ఎటూ నిర్ణయించుకోలేకుండా వున్నాను!
నిజంగా నేననుకున్నదే నిజమైతే, ఆమె నామీద అంత గౌరవం యెందుకు చూపుతుంది? మునుపు యిచ్చే గౌరవంలో, చూపే ఆదరణలో, యేమాత్రం లోటుగానీ, సంశయించవలసిన విషయంగానీ కనిపించలేదు. నేనే అనవసరంగా అపోహపడుతున్నానా? నాలోనే కల్మషం ఉండి, ఆమెనలా అనుమానిస్తున్నానా? లేదు, అగ్ని లేందే పొగపుట్టదు. అతనితో కాస్తయినా సంబంధం వుండి వుంటుంది.
ఈరోజు ఉదయం, అతను చూసిన చూపులు, చేసిన చేష్టలు, యే సంబంధమూ లేనివాడు చేసేవిగా కనిపించ లేదు. పోనీ అతనలా ప్రవర్తిస్తే, దానికి తగ్గట్టుగా లత ప్రవర్తన కూడా బాగాలేదు.