బ్రహ్మము అన్న పదం "బృ" అన్న సంస్కృత ధాతువు నుండి వచ్చినది. ఈ ధాతువుకు అర్ధం వ్యాపించడం, పెరగటం, చలించటం (to move). నిరుక్తలో కూడా యాసముని చలనం అనే అర్థాన్నే సూచించారు. అయితే ఇక్కడ చలనము అనగా స్పందన అనే భావంతో చూడాలి. అనగా స్పందన కలిగి, చలనముతో కూడి వ్యాపించేది అని స్థూలంగా అర్థం చేసుకోవచ్చును. విశ్వంలో చలించకుండా ఉండేది అంటూ ఏమీ ఉండదు. చివరకు స్థలం (Space) కూడా చలనం కలిగి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం అనగా ఈ విధంగా చలనంతో కూడిన ఈ విశ్వం గురించి తెలుసుకోవటమే. “విశ్" అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన విశ్వం అన్న పదానికి అంతటా, అన్ని కలిగి ఉన్న, సర్వవ్యాప్తంగా అనే అర్థాలు వస్తాయి. 'విష్ణువు' అన్న పదం కూడా ఈ ధాతువు (to pervade) నుండే ఏర్పడింది కాబట్టి విష్ణువు అనగా సర్వవ్యాపి, అంతటా ఉన్నవాడు అని అర్థం. కావున విశ్వం గురించి తెలుసుకోవటం అన్నా, ఆ విష్ణువు గురించి తెలుసుకోవటం అన్నా ఒకటే. విశ్వజ్ఞానం అంటే విశ్వం యొక్క ఉనికి, ఏర్పడిన విధానం, దాని పరమార్థం, ఇవన్నీ తెలుసుకోవటమే.
మానవ మేధస్సు అంకురించిన కాలం నుంచి కూడా ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే తపన మనిషికి కలుగుతూనే ఉంది. ఈ తపనతో ఆ మనిషి జ్ఞానాన్ని అందుకోవటానికి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విశ్వం గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా శాస్త్రవేత్తలు శోధించేది ఆ జ్ఞానం కోసమే. పరమాత్మ ఉనికిని దర్శించే ప్రయత్నంలో భాగంగా మన ఋషుల తపస్సు ఆ జ్ఞానం కోసమే. శాస్త్ర ప్రపంచం దానిని సైన్స్ అని అంటే మన మహర్షులు దానిని వేదం అని అన్నారు. ప్రయత్నం ఏ రకంగా జరిగినా అంతిమంగా బ్రహ్మజ్ఞానం పొందటం కోసమే. ఇక ఈ విశ్వం యొక్క ఉనికిని అర్థం చేసుకునే విషయానికి వస్తే ముందుగా అసలు ఈ విశ్వం యొక్క సృష్టి అనేది ఉంటుందా, లేదా అనే సందేహం మొదలవుతుంది. ఈ విశ్వం ఎలా వచ్చింది, దీనికి ఆది, అంతం అనేవి ఉంటాయా, విశ్వానికి మొదలు ఉంటే మరి ఆ బ్రహ్మము యొక్క సృష్టి కూడా ఉన్నట్లేనా, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అనే సందేహాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ విషయాలపై అన్ని వర్గాల మేధోమధనంలో కూడా భిన్నరకమైన సిద్ధాంతాలు ఆవిష్కరింపబడ్డాయి. సామాన్య పరిభాషలో చెప్పాలంటే సృష్టి అంటే అంతకు ముందు వరకూ లేనిది కొత్తగా ఏర్పడటం. లోతుగా, ఫిలసాఫికల్గా విశ్లేషణలు చేయని ఒక సామా న్యుడు అర్థం చేసుకునే భావం అదే కదా. మరి ఈ భావంతో జరిగిందా? లేదా? అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఇటు తాత్విక ప్రపంచంలో కూడా రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఒకటి ఈ విశ్వానికి