“బ్రతుకు ఫలం"
(ఇది నా కథ)
మాది సాధారణ రైతు కుటుంబం
ఒక చిన్న పెంకుటిల్లు వూరిలో
ఒక పశువుల కొష్టం- పొలంలో
పదునైదు ఎకరాల మెట్ట పొలం ఆస్తిగా
మా తల్లిదండ్రులు బీనీడి పెదకోటయ్య చౌదరి - రాఘవమ్మగారలు, మేము నలుగురు సంతానం,
పెద్ద వాడను నేనే, నా తరువాత యింకా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, మాది నూటికి నూరు పాళ్ళు వ్యవసాయ కుటుంబం, ఒక జత ఎడ్లు- రెండు ఆవులు- రెండు గేదెలు- ఒక కమతగాడు, అమ్మా నాన్నలు ఎక్కువ కాలం పొలంలోనే గడిపేవార
మా ఇల్లు- మా అమ్మమ్మగారి యిల్లు దగ్గర దగ్గరగా ఒకే వీధిలో వున్నందున నా బాల్యంలో ఎక్కువ కాలం మా తాతగారు బొలినేని సుబ్బయ్య- లక్ష్మీదేవమ్మ గారల దగ్గరే గడిచింది ఏదో వేళకు తింటున్నాం, సర్కారు బడికీ - ట్యూషన్ బడికీ వెళ్తున్నాం- వస్తున్నాం అంతే మాపై పెద్దల పర్యవేక్షణ అంతగా వుండేది కాదు ఉపాధ్యాయులంటే గౌరవం కన్నా భయం ఉండేది స్కూలు విడిచిపెడితే, స్నేహితులు- ఆటలు, ఎలాగోలా క్రిందా మీదా పడి ఎనిమిదో తరగతిదాకా వచ్చాను
అప్పుడు అడిగాను మా నాన్నను,
సర్కారు స్కూలులో ఫీజు కట్టాలని - ఎంత?
అంతా పదిరూపాయలలోపు
అయినా ఆ పదిరూపాయలకే కటకట. అప్పట్లో రైతాంగం దగ్గర డబ్బులెక్కడున్నాయ్, ధాన్యం మాత్రమే పుష్కలంగా వుండేది. ఇంటిలో జాగాలేక, దొడ్లో పాతరతీసి, ధాన్యం దాచేవారు. గరిశెల్లోనూ ధాన్యం నింపేవారు. ఏదైనా చిరుతిండి కొనుక్కోవాలన్నా, రెండు దోసిళ్ళ ధాన్యం చొక్కాలో పోసేవారు ఆ ఒడి అలాగే పట్టుకొని కొట్టుకు వెళ్తే వాళ్ళ ధాన్యం కొలుచుకొని, తగిన తినుబండారాలు యిచ్చేవారు ఇక యింట్లో డబ్బు చూడాలంటే సంవత్సరానికి ఒకసారి ధాన్యం అమ్మితేనో, ఎండుమిర్చి అమ్మితేనో వచ్చే డబ్బులే కన్పిస్తాయి............