అంతరంగ మథనం
- శివరాజు సుబ్బలక్ష్మి (శ్రీమతి బుచ్చిబాబు)
మిమ్మల్ని గురించి వినాలనీ, మిమ్మల్ని గురించి ఎవరైనా, ఏమైనా రాస్తారేమోననీ చూడటంతో చాలాకాలం శూన్యంలో కాలం కదలి తనతో నన్నూ దొర్లిస్తూంటే అక్కడ, అక్కడ, అప్పుడు అప్పుడు మిమ్మల్ని గురించిన రచనలు ఆకాశంలో చుక్కల్లా కొన్ని మాటలు ఆప్యాయంగా వుంటే, వాగులోని తేటనీరులాగా నిర్మానుష్యంగా వున్న గుబురు చెట్ల మధ్య సంధ్యకాంతిలాగా ఎడ్లబండిలో సంధ్య చీకటిలో వూరి పొలిమేర చేరితే కనపడీ కనపడని మసకతో దూరంగా గుడిసెల్లోని వంటచెరుకు ఇంటికి వెలుగునిస్తూ వూరిపైకి పొగని ఆకారంలేని ఆకారాల్లా ఎదురవుతుంటే - అటుచూడు ఆ పొగలు పిలుస్తూన్నట్లు వున్నాయి. నాకు. నీకు ఏమనిపిస్తోంది, అంటూ గట్టిగా హో! హో! హో! అంటూ నవ్వే ఆకంఠం మూగపోయింది అంటుంది లోకం.
కానీ నేను అప్పటివరకే కాదు ఇప్పటిదాకా అవే రోజులు అవే జ్ఞాపకాలు ఆ ఊహల్లోనే జీవిస్తున్నా. కాలం వయస్సుని వెక్కిరిస్తూ ఇంక విశ్రాంతి తీసుకోమనే రోజులు దగ్గరవుతున్నా ఈ శరీరం మూలిగినా అందుకు దిగులు లేదు. గతంలోని మధురమైన క్షణాలు, అవే మీరు రచనలు చేస్తూ సందేహంగా నాకేసి చూస్తూ ఇక్కడ ఇది నాకు నచ్చలేదు, నీకు ఏమి అనిపిస్తోందో చూడు, అంటూ చూపే ఆ ఆప్యాయత, అమాయకంగా చూసే ఆ కళ్ళు చిత్రించుకున్న బొమ్మలా భద్రపరచుకున్నట్లు మనస్సులో మేలుకొని జ్ఞాపకాల పుటల్ని తెరచి చూసుకోవటం మీరులేని ఈ కాలంలో అలవరచుకున్న నేస్తం. అప్పుడు మనం మద్రాసులో ఎగూర్లో గంగురెడ్డి రోడ్డులో వుండేవాళ్లం. యుద్ధం ముగిసినా, ఆ ఛాయలు ఇంకా పూర్తిగా వీడలేదు. మీరు "చివరకు మిగిలేది" నవల రాయడం పూర్తి కాలేదు. ఆ రోజు పేపర్లో టి.ఎస్. ఇలిఎట్ పుస్తకాల సెట్టు ఆరు - బాక్సులో అమర్చినట్టు ఫోటోలేశారు. అది చూసి నాకు కొనుక్కోవాలని వుంది కానీ, బడ్జెట్ ఈ నెల్లో... మాట పూర్తి చెయ్యకుండానే..................