మనదేశం ఎటుపోతున్నది?
జర్నలిజం మునుపెన్నడూ లేనంత సంక్షోభంలో ఉన్నది. ఒక్క ఎమర్జెన్సీ కాలంలో తప్ప, డెబ్భైఅయిదేళ్ల 'స్వతంత్ర' భారతదేశంలో వార్తాసాధనాలు ఎంతో కొంత మేరకు స్వతంత్రంగానే పనిచేశాయి. ఎమర్జెన్సీలోనూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు మీడియాపై నియంత్రణను కొంతవరకు ప్రతిఘటించాయి. గతంలో ఫాసిజం, నాజిజం అధికారంలో ఉన్న కాలంలో జర్మనీ, ఇటలీ లాంటి దేశాల్లో మీడియాపై పాలకులకు పూర్తి నియంత్రణ ఉండడం తెలిసిందే. అబద్ధాలకు, కట్టుకథలకు గోబెల్స్ పర్యాయపదంగా మారిపోయాడు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, ఫాసిస్టు, నాజీయిస్టు భావజాలం ఓడిపోయింది. ఓడిపోయిందే కాని దాని ముగింపు పూర్తి కాలేదు. అది ఇంకా బ్రతికే ఉందన్నదానికి, ట్రంప్ రెచ్చగొట్టిన అల్లరి మూకలు అమెరికన్ కాంగ్రెస్ మీదే దాడి చేయడం ఒక ఉదాహరణ. బ్రెజిల్లో కూడా ఇలాంటి ముఠాలు అదే రకపు దాడిని చేశాయి. ప్రపంచంలో ఫాసిజం, నిరంకుశత్వం ఏదో రూపంలో తలెత్తతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సైనికపాలన, నియంతృత్వం అమలులో ఉన్నది. తీవ్రవాద రైటిస్టులు అనేక దేశాల్లో అధికారంలోకి వచ్చారు. గత తొమ్మిది సంవత్సరాల అనుభవాన్ని బట్టి, మనదేశంలో పరిస్థితి మున్ముందు ఎంత తీవ్రంగా పరిణమించనున్నదోనని ప్రజాస్వామిక సమర్థకులు ఆందోళన పడుతున్నారు.
జర్నలిజం ఇలాంటి దుస్థితిలో పడడానికి ప్రధాన కారణం, పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం చాలా మారిపోవడం. ఆరంభదశలలో పెట్టుబడిదారీ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థతో పోరాడడం వలన, ఆ ఘర్షణలో నుండి కొన్ని ఉదాత్తమైన మానవ విలువలు వికాసం చెందాయి. పెట్టుబడిదార్ల మధ్య నిరంతర పోటీ ఉండడం వల్ల, ఆ పోటీకి కొన్ని ప్రమాణాలను అంగీకరించడం వల్ల రాజ్యాంగం, చట్టబద్ధ పాలన వంటి భావనలు, వ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి. పౌరులకు కొన్ని ప్రజాస్వామిక పౌర హక్కులు,...........