కం. సిరిగల వానికి చెల్లును
తరుణుల పది యారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్ద రాండ్రా?
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్
శ్రీనాథ మహాకవి చెప్పిన పరమ చమత్కారమైన చాటు పద్యం ఇది. ఒక మండు వేసవి కాలంలో ఆ మహాకవి పల్నాటి సీమలో ప్రయాణం సాగిస్తున్నాడట. దాహంతో గొంతెండి పోతోంది. చుట్టుప్రక్కల ఎక్కడా చుక్క మంచినీరు లేదు. దారిలో ఎక్కడో పెద్ద శివుని విగ్రహం కనబడిందట. అంతే! అత్త మీద కోపం దుత్త మీద చూపించిందన్న సామెతగా కవిగారి గుండెల్లోంచి పద్యం దూసుకువచ్చింది.
పరమేశ్వరా! విష్ణుమూర్తికి పదహారు వేలమంది భార్యలున్నారంటే అర్థం ఉంది. ఆయన లక్ష్మీపతి. కోటీశ్వరుడు. పోషించే సమర్థత ఉంది కాబట్టి ఎంతమందినైనా చేసుకొంటాడు. తిరిపెం (బిచ్చం ఎత్తుకొని బ్రతికే నీకు గౌరి, గంగ అంటూ ఇద్దరు పెళ్ళాలెందుకయ్యా? ఆ గౌరిని నీవు అట్టేపెట్టుకొని గంగని మాకు వదిలెయ్యి అని పద్యం భావం. గంగని ఆ ప్రాంతంలో వదిలేస్తే నీటికి లోటుండదని కవిగారి ఉద్దేశ్యం. అంతకంటే వేరే చెడు భావం ఏమీ లేదు. మొత్తం మీద గ్రుక్కెడు నీళ్ళ కోసం శివుడి సంసారంలోనే చిచ్చు పెట్టాడీ కవి పుంగవుడు. అదీ కథ................