మరాళ దేశాన్ని పుష్పకాంతుడనే రాజు పాలించే కాలంలో ఆయన ఆస్థానంలో ముచికుందుడనే పండితుడుండేవాడు. అతడు పెద్ద స్వార్థపరుడేకాక, అహంకారి కూడా. ముందుగా అతణ్ణి ఆశ్రయించి, తమ మాటలతో, సేవలతో మెప్పించిన వారికే రాజాస్థానంలో ప్రవేశం దొరికేది. 'ఈ కారణం వల్ల ఎందరో సమర్థులైన పండితులు, జ్ఞానులూ రాజాశ్రయం లభించక పరదేశాలకు వలసపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణకాంతుడనే యువకుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేసి, రాజాశ్రయం కోసం వచ్చాడు. అతడికి కొద్దిరోజుల్లోనే ఆస్థాన స్థితిగతులూ, ముచికుందుడి స్వార్థపరత్వం గురించి తెలియవచ్చింది.
కృష్ణకాంతుడు తానెరిగిన ఒక బంధువు ద్వారా, రాజనర్తకి మందారమాల పరిచయం సంపాయించుకున్నాడు. ఆమె కృష్ణకాంతుడి పాండిత్యం చూసి ముగ్ధురాలై, అతడికి తప్పక రాజదర్శనం అయ్యేలా చేస్తానని మాట యిచ్చింది.
ఒక రోజున మందారమాల నాట్య ప్రదర్శనానికి ఆస్థానానికి వెళుతూ, కృష్ణకాంతుణ్ణి వెంటబెట్టుకుపోయింది. రాజనర్తకి తోడుగా వున్నందున ద్వారపాలకులెవరూ అతణ్ణి అడ్డగించలేదు. ...