అనామిక
కథ వండుదామని కలం పట్టుకుని కాగితాలు పెట్టుకుని కూచున్నాను. ఇతివృత్తాన్ని ఎసరు మీదికెక్కించాను. కథానాయకుణ్ణి ముక్కలుగా తరిగి కారప్పొడి జల్లి పచ్చడి. చెయ్యాలనుకున్నాను. ఇందుకు ఎవరు అనుమతిస్తారా అని జ్ఞాపకం ఉన్నంత మట్టుకు సాహిత్యాన్ని గాలిస్తున్నాను. కథా నాయకులందరినీ ఇదివరకే సినిమావాళ్ళు పచ్చడి చేసి నంచేసుకున్నారు నాకొక్కడినీ మిగల్చకుండా, సరే, కథానాయకుడి మాట తర్వాత ఆలోచించుకోవచ్చునని కథాకాలం గురించి మొదట నిర్ణయించుకుందామనుకున్నాను. కథ చదివితే నాలిక మండేటంత ఘాటైన కాలం ఏది? నేటి కాలం మాత్రం కాదు. ఇది కథలకి కాలమే కాదు. రుచీ పచీ లేనివి తప్ప కమ్మగా కారంగా ఉండే కథలు ఈ కాలంలో కనబడవు. అంతే కాదు. పూర్వకాలం సత్యకాలం కాబట్టి అప్పుడు మనుష్యులతో జంతువులు మాట్లాడేవి. దేవతలు ప్రత్యక్షమయేవారు. కథకి కాళ్ళూ చేతులూ ఉండేవి. కావు. ఇప్పుడు కథ నడిపిస్తేనే గాని ఎవరూ చదవరు. తలా తోకా లేని కథలు ఎవరికీ అక్కరలేదు.
అదొహటిన్నీ, ఈ రోజుల్లో ఎవరి కథలు వాళ్ళే రాసుకుంటున్నారు. వాళ్ళకి మనం వండిపెట్టే కథలు సయించవు. నీ కథ ఎవడికి కావాలి? మా ఇంటికి రా, అటక మీద అవకాయ గూనల్లో అనేకమైన కథలున్నాయంటారు. బాగా ఊరిన కథలు. అన్నట్టు పత్రికల్లో పడే వార్తల్ని కూడా కథలే అంటున్నారిప్పుడు. “ఇందులో ఏమీ స్టోరీ లే” దంటాడు సంపాదకుడు రిపోర్టరు తెచ్చిన వార్తను చదివి. జరిగింది జరిగినట్లుగా రాశానంటాడు రిపోర్టరు. అందుకే ఇంత అధ్వాన్నంగా ఉందని సంపాదకుడు దాన్ని చి.కా.బు. లో పారేస్తాడు.
చి. కా. బు. అంటే జ్ఞాపకం వచ్చింది. చిత్తు కాగితాల బుట్టల్లో వెదికితే ఎన్నో కథలకి బీజాలు దొరుకుతాయి. చాలా కథల్ని సంపాదకుడు చంపేస్తూ వుంటాడు. దానికి చాలా కారణాలుండొచ్చును. రాజకీయ, నైతిక, సంసారిక, లౌకిక, పారలౌకిక కారణాలు. వీరేశలింగం పంతులూ, చిత్తుకాగితాల బుట్టా కథ మీరు వినే వుంటారు.
"ఆ కథ చెప్పవూ?” అంది నా ఆకలి. ఆకలి అడిగినప్పుడల్లా కథ చెప్పకూడదు.....................