ఛత్రపతి శివాజీ
ఆకాశం అంచుల్ని ముద్దాడుతున్న అందమయిన తిమిరరాసి! అర్జున, తమాల, వనచూత వృక్షాలు మంచు మబ్బుల కౌగిలింతలో ఒదిగి నిలిచాయి. చల్లని శిశిర వాయువులు స్పర్శతో గిలిగింతలు పడుతోంది ప్రకృతి కాంత.
నేలంతా రాలిన ఆకులతో పువ్వులతో రంగు రంగుల దుప్పటి కప్పుకున్నట్లుగా వుంది జరీపూలు కుట్టిన నల్లని పటంలా పరుచుకుంది గగన మండలం.
ఎక్కడా కనుపించని చంద్రుడూ అంతట కనిపించే చుక్కలతో పూచిన మల్లెపందిరిలా వున్న ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అతడు.
వయసున చిన్నవాడు పదునాలుగేండ్లయినా నిండని పసివాడు కసిగా ఆలోచిస్తున్నాడు. అడవి జంతువులు మెలమెల్లగా పొదలలోకి దూరిపోతున్నాయి. సింహాలు వేట చాలించి తిరుగు ముఖం పట్టాయి.
అయిన అతడు కూర్చున్న చోటునించి కదలలేదు.
చలిచలిగావున్న శిశిరరాత్రి ముగియుచున్న వేకువ అది. వెన్నముద్ద చుక్క వెండి ముద్దలా ధగధగలాడుతోంది. కన్ను చెదిరే కాంతుల్ని వెదజల్లుతోంది. చీకటి పల్చబడి తొలిసంధ్య తెల్లదనాన్ని సంతరించుకొంటోంది.
ఈవేళ అయినా తండ్రి తిరిగివస్తాడో లేదో! అన్న సమస్య అతని మనసంతా ఆక్రమించుకుంది. మిత్రుడు ప్రదర్శించిన వాచాలత్వంలోని నిజానిజాలేమిటో తేల్చి వేసుకోవాలన్న పట్టుదల క్షణక్షణానికి పెరుగుతోంది. మనసు అశాంతి నిలయమౌతోంది. కన్నీరు పొంగి చెంపలమీదుగా జారుతున్నాయి. నునులేత చెక్కిళ్ళు తడిసి చిత్తడి అవుతున్నాయి.
ఆకులు రాలిపడిన కాలిబాటమీద గల గల శబ్దమయింది. అతడిలో ఆలోచనకు భంగమయింది. తలఎత్తి చూచాడు. ఒకనీడ దగ్గర అవుతూ కన్పించింది.
పొడవైన ఆకృతి, ఒక చేతిలో దండము, మరొక చేతిలో కమండలము, నిడుపైన ఉడుపులు, తేజోపూర్ణమైన ముఖవర్చస్సు, విజ్ఞానపు వెలుగుతో మిలమిల మెరిసే నేత్రాలు, లేపనాలవల్ల జటలు కట్టిన కేశాలు తరళాయితంగా ఎర్రగా వున్న పెదవులు, దీర్ఘమై..............................