ఉత్తరాల పుస్తకం
ఎస్.ఎస్.ఆర్. జగన్నాథరావు
కార్యదర్శి, క్రియ, కాకినాడ
తల్లిదండ్రులయినా తమ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారు? ఆరోగ్యంగా, బాగా చదువుకుంటూ, తోటి పిల్లలతో సంతోషంగా ఆడుకుంటూ, తరగతి పుస్తకాలకే పరిమితం కాకుండా జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఒక చక్కటి వ్యక్తిగా ఎదగాలని ఆశిస్తారు. దీనికి అక్షర రూపమే ఈ ఉత్తరాల పుస్తకం. పదవ తరగతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏడవ రాంకు తెచ్చుకుని జహీరాబాద్ లో గైనకాలజిస్టుగా స్థిరపడి, అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న డా. విజయలక్ష్మిగారు వాళ్లబ్బాయిని 5వ తరగతిలో హాస్టల్లో చేర్చినప్పటి నుండి ఆరేళ్లపాటు రాసిన ఉత్తరాలే ఈ పుస్తకం.
ఇంచుమించు ప్రతి ఉత్తరంలో ఏదొక అంశం సంక్షిప్తంగా, అనేక కోణాలలో చెప్పబడి ఉంటుంది. పుస్తకం పూర్తిచేసేసరికి అసలీవిడ ముట్టుకోని అంశం లేదా అనిపిస్తుంది. ఇందులో ప్రతి విషయం పిల్లల కోసం, పిల్లల ఆసక్తికి తగినట్టు చెప్పబడి ఉంటుంది. కారణం ఈ ఉత్తరాలు కల్పన కాదు ఒక తల్లి నిజంగా తన పిల్లవాడికి రాసినవి.
పిల్లాడికి 9 నుండి 14 ఏళ్ల వయసు ఉన్నపుడు రాసిన ఉత్తరాలివి. పిల్లలు తమ ఇల్లు, పరిసరాలు దాటి ప్రపంచం గురించి తెలుసుకొనే ప్రయత్నాలు మొదలెట్టే వయసిది. ఇంతకంటే చిన్నపుడు చెప్పినా అర్థంకాదు. టీనేజి వయసు వచ్చేక వాళ్లంతట వాళ్లు తెలుసుకోవడమే తప్ప ఇంట్లో వాళ్లు చెబితే వినేది తక్కువే. పిల్లలు విన్నది మాట్లాడతారు, చూసింది చేస్తారు. పిల్లలు అబద్దాలు ఆడకూడదు అని మనం అనుకుంటే మనం అబద్ధాలాడటం మానేయాలి. నీతులు చెప్పడం ద్వారా పిల్లలు మంచివాళ్లగా తయారవుతారని నేను నమ్మను. కాని కథలు చెప్పడం ద్వారా, సరదా అయిన, ఆసక్తికరమైన సంఘటనలు చెప్పడం ద్వారా వాళ్లలో కుతూహలం, ఆలోచన పెరుగుతాయి. పిల్లలతో మనం ఏదో ఒకటి మాట్లాడుతూ టచ్ ఉండటం అనేది ముఖ్యం. హాస్టల్లో ఉన్నాడు కాబట్టి ఉత్తరాల ద్వారా ఆ పని చేసారు రచయిత. రకరకాల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పిల్లలలో సహజంగా ఉంటుంది. అందులో స్వాతంత్య్ర పోరాటయోధులు, సైంటిస్టులు, సమాజ సేవకులు వంటి గొప్ప వ్యక్తుల వివరాలు ఎక్కడ దొరికినా ఆసక్తిగా చదువుతారు..........