శ్యామల
గుంటూరులో మొన్న మొన్నటి దాకా సబడ్జీ చేసి జనవరిలో కాలం చేసిన శ్రీధరరావు గారి స్వకీయ చరిత్ర యీ క్రింద ముద్రిస్తున్నాము. ఆయన చనిపోయిన కొన్ని నెలల దాకా ఆయన కాపురమున్న యిల్లు తాళము వేసియుండెను. తరువాత ఆయన అల్లుడును మా స్నేహితుడును అయిన ముకుందరావు తాళములు తీయించి యింట్లో ప్రవేశించెను. శ్రీధరరావుగారి కాగితములు పరిక్షించడములో ఈ క్రింది స్వకీయ చరిత్ర ఆయన సొరుగు పెట్టెలో దొరికినట్టూ, అది 'సాహితి'లో ప్రకటించ వలసినదనీ మాకు చెప్పడంచేత దాన్ని మేము ప్రకటిస్తున్నాము. ఆంధ్రదేశంలో వున్న పెద్ద ఉద్యోగస్థులలో మంచి వాడనిన్నీ దానశీలు డనిన్నీ, ఉపకారబుద్ధి కలవాడనిన్నీ పేరుప్రతిష్టలు సంపాదించిన శ్రీధరరావు గారిని ఎరుగని ఆంధ్రులుండరు. కాని, మొదటి నుంచీ పెళ్ళి చేసుకొనక బ్రహ్మచారిగానే వుండి నిష్కలంక ప్రవర్తనము గలవాడై వుండుటకు కారణము ఎవరికీ ఇదివరలో తెలిసివుండదు. ఇదివరలో చాలామంది ఆయన బ్రహ్మచారి కాడనిన్నీ ప్రధమభార్య పోయిన తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకోవడం మానివేసినాడని చెప్పుకోవడం కలదు. ఆ అభిప్రాయం యధార్ధము కాదని యీ చరిత్ర చదివిన వారికి బోధపడదు. అంతే కాకుండా నిజమైన ప్రేమ యెట్టిదో ఆయన అనుభవించినా కూడా అందరకూ తెలియగలదు. నిజమైన ప్రేమకు ప్రతిపలము ప్రేమించిన వారితో సౌఖ్యమనుభవించడమైతే ఆయన ప్రేమకు ప్రతిఫలము ముట్టలేదని చెప్పవచ్చును. ప్రేమించడమే సౌఖ్యముగా భావించి ఆ సౌఖ్యమే ప్రేమకు ప్రతి ఫలముగా గ్రహించిన యెడల అట్టి సౌఖ్యం ఆయనకున్నట్టే చెప్పవలెను.
ఇంకొక విషయము చెప్పి యింతటితో ఈ పీఠిక ముగిస్తున్నాము. ఆయన చిన్న తనమునుంచీ తెలుగు భాషయెడ అభిమానము గలవాడనీ, ఆంధ్రత్వ మీయనయందు............