అనువాదకుడి మాట
మాటకూ, దాని అర్థానికీ మధ్య ఉన్న నిత్యసంబంధం గురించి మనకందరికీ అంతో ఇంతో తెలుసు. బహుశా ఈ నిత్యసంబంధం గురించి మొట్టమొదట చెప్పినవాళ్ళు మీమాంసకులు; సాహిత్యం విషయానికొస్తే, వాగర్థాల మధ్య . నిత్యసంబంధం గురించి చక్కని ఉపమాలంకారంతో- 'రఘువంశం' మహాకావ్యం మొదట్లోనే చెప్పినవాడు కాళిదాసు. ఈ నిత్యసంబంధం ఎంత సామాన్యమైందో అంత సంక్లిష్టమైంది కూడా. ఇతర నాగరికతలతో సంబంధం ఏర్పడిన నేపథ్యంలో వాడుకలోకి వచ్చి స్థిరపడిన కొన్ని మాటలకు ముఖ్యంగా కొన్ని పారిభాషిక పదాలకు ఆ అర్ధాలు ఎలా ఏర్పడి, స్థిరపడ్డాయో తరచు మనం విమర్శగా పరిశీలించుకోవాలి.
ఉదాహరణకి, తెలుగులో మొట్టమొదటి వచన (వాక్య) గ్రంథకర్త స్వామినీన ముద్దు నరసింహం నాయుడు, చరిత్రాత్మకమైన తన రచన “హితసూచని"లో ఒక్కో అధ్యాయానికీ “ప్రమేయం” అనే మాట వాడారు. ఇంగ్లిష్లో "essay” అనే అర్థంలో ఆయన ఆ ప్రయోగం చేశారనిపించింది. అది 1852-'62 నాటి మాట! అదే సమయంలో ప్రామాణిక నిఘంటువు రూపొందించిన ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, ఆ ఇంగ్లిష్ మాటకు "యత్నము, సాధకబాధకముల వివరణము" అంటూ తెలుగులో అర్థం చెప్పారుగానీ, “ప్రమేయం” అనే మాట వాడలేదు! "essay” అనే మాటకి వ్యాసం అనే అర్థం ఎప్పుడు వచ్చి స్థిరపడిందో తేల్చాలంటే, లోతైన అధ్యయనం, నిశితమైన పరిశీలన అవసరం. ఆ పరిశీలన సార్థకంగా సాగాలంటే, ఏకాగ్ర చిత్తంతో “చింతన” చెయ్యవలసిన అవసరముంది. మాన్యమిత్రులు...........................