రాతిలోతేమ
ఎవ్వరికీ ఏమీ అర్థం కావటం లేదు. ఎప్పుడూ సందడిగా తిరుగుతూ ప్రతి ఒక్కరికీ ఏదో ఒకపని పురమాయిస్తూ తిరిగే సుభద్రమ్మ తన సవతి కూతురు మాధవి పెళ్ళిమాట వినబడంగానే ఉదాసీనంగా మారిపోయింది.
"మాధవి పెళ్ళి అయితే నేనింక నిశ్చింతగా ఉంటాను” అంటుండేది గదా! ఇప్పుడీ నిరసన ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు.
సుభద్రమ్మకి..... మాధవి అంటే ఒక గుదిబండ, ఆవిడ జీవితంలో ఒక పెద్ద చేదుమాత్ర. అది ఎప్పటికీ మింగుడు పడటంలేదు. అప్పటికీ మాధవిని వదిలించుకునేందుకు చాలా ప్రయత్నించింది.
పెళ్ళిఅయి వస్తూనే సుభద్రమ్మ తన భర్త రామ్మూర్తిని వేళ్ళమీద ఆడించడం మొదలుపెట్టింది. అతనికి నయానా భయానా నచ్చజెప్పి ఏడాది లోపు పసికందు మాధవిని అమ్మమ్మ దగ్గరికి పంపించేసి నిశ్చింతగా ఊపిరి తీసుకుంది.
రామ్మూర్తికి బాధగా ఉండేదిగానీ ఏమీ చేయలేని నిస్సహాయుడై పోయాడు. పురిటికందుగానే తల్లిని పోగొట్టుకున్న మాధవిని ఎలా పెంచ గలడు. కొన్నాళ్ళు అలాగే అవస్థలుపడి నలుగురి సలహాతో బీదింటి పిల్ల సుభద్రని రెండోభార్యగా తెచ్చుకున్నాడు. పెళ్ళికిముందే సుభద్రకి తన పరిస్థితి వివరంగా చెప్పాడు. మాధవిని సొంతబిడ్డలా ఆదరించాలనికూడా చెప్పాడు. అన్నిటికీ ముందు ఒప్పుకున్న సుభద్ర పుస్తె పడగానే నిజస్వరూపం బయట పెట్టింది. ఫలితంగా మాధవికి తల్లేకాదు, తండ్రికూడా దూరమైపోయాడు.......................