ఎదురుగ క్షీరసముద్రాలున్నా హృదయానికి దాహం
కరిగే తొలకరిమేఘాలున్నా గగనానికి దాహం.
తీర్చిన సభలో తలలే అలలై తెగ ఊగేస్తున్నా..
రసికత ఒలికే చెవి లేదేమని రాగానికి దాహం.
తన రాక కొరకు సమస్తలోకం తారాడుతువుంటే
చెరిగే చీకటిసిగ నిమరాలని కిరణానికి దాహం.
ఎన్ని చూపులో తన చుట్టుగా భ్రమిస్తూనేవున్నా
అనువైన తనువు లభించలేదని అందానికి దాహం.
ఒడినిండా జలసంపదలెన్నో ఉరకలు వేస్తున్నా
చేరిన అల తనతో నిలవాలని తీరానికి దాహం.
తన ముంగిటిలో వెలకందని సౌందర్యరాసులున్నా
ఊహా ప్రేయసి కనపడదేమని దేహానికి దాహం.
విశాలసాగర పథాలలోపల విహరిస్తూవున్నా
గిరిదాటి మట్టిలో ఆడాలని కెరటానికి దాహం.
వేనవేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో
మనిషిగా క్షణం జీవించాలని మరణానికి దాహం.
అదృశ్యశక్తులు జీవిత గతులను అవరోధిస్తుంటే
కాలాన్ని జయించాలని 'సినారె' కావ్యానికి దాహం.. ..........
తెలుగు గజళ్లు
డా|| సి. నారాయణ రెడ్డి