అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు 'యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.'
ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక 'సినిమా ఒక ఆల్కెమీ.'