ఆరేళ్ల వయసప్పుడు 'ట్రూ స్టోరీస్ ఫ్రమ్ నేచర్' అనే పుస్తకంలో ఒక అద్భుతమైన బొమ్మను చూశాను. ఒక జంతువును మింగుతున్న కొండచిలువ బొమ్మ అది. ఆ బొమ్మ ఇలా ఉంది:
దాని గురించి పుస్తకంలో ఇలా రాసి ఉంది: “వాటికి దొరికిన జంతువులను నమలకుండానే కొండ చిలువలు అమాంతం మింగేస్తాయి. ఆ తరవాత భుక్తాయాసంతో కదలలేక, మింగిన జంతువులు జీర్ణమయేదాకా ఆరు నెలలపాటు కొండ చిలువలు నిద్రపోతాయి.”
బొమ్మ గీయాలని నాకు సరదా పుట్టింది. ఒక కాగితం, రంగు పెన్సిల్ తీసుకుని కాసేపు కష్టపడి నా మొదటి బొమ్మ గీశాను.
ఆ బొమ్మను పెద్దవాళ్లకు చూపి, “దీన్ని చూస్తే మీకు భయం వేస్తోందా, లేదా?" అని అడిగాను.
వాళ్లు నవ్వేసి, "భయమెందుకు? టోపీని చూసి ఎవరైనా భయపడతారా?" అన్నారు.
నేను గీసిన బొమ్మ టోపీ కానే కాదు. అది ఏనుగుని మింగిన కొండచిలువ బొమ్మ. కాని, అది పెద్దవాళ్లు తెలుసుకోలేకపోయారు! అందుకని మరో బొమ్మను గీశాను. ఆ బొమ్మలో కొండచిలువ పొట్టనీ, అందులో ఉన్న ఏనుగునీ గీశాను. ఈసారి పెద్దవాళ్లకు అదేమిటో బాగా తెలుస్తుందని అనుకున్నాను. వాళ్లకి ఏదైనా సరే వివరంగా చెబితే తప్ప అర్థం కాదు కదా! నా రెండో బొమ్మ ఇదుగో:
ఈసారి పెద్దవాళ్లు నా బొమ్మను చూసి, వచ్చీరాని బొమ్మలు గీయటం మానుకోమని, కొండచిలువలను, వాటి కడుపులోని ఏనుగులను..................