జాతి స్మృతిలో అరుణతార
పదవుల చుట్టూ పరిభ్రమించే రాజకీయాల్లో ప్రజల తరపున నిజంగా స్థిరంగా నిలబడే నాయకులు అత్యంత అరుదు. అధికారమే పరమావధిగా మంచినీళ్లు తాగినంత సులభంగా మెడలోని కండువాలను మార్చేసే తాలునేతల కాలంలో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసమస్యలపై నిరంతరం గళమెత్తేవారు ఏ కొందరో కనపడతారు. సమకాలీన భారతంలో అటువంటి దిగ్గజ నేతల్లో ఒకరు సీతారాం ఏచూరి. దాదాపు అయిదు దశాబ్దాల ప్రజాజీవితంలో నైతిక విలువలతో ఏనాడూ రాజీపడని వామపక్ష యోధుడాయన. కేంద్రంలో కాంగ్రెస్ సర్వంసహాధిపత్యం వహిస్తున్న రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావాణిని గట్టిగా వినిపించారు. ఏచూరి, తదనంతరం ఆచరణాత్మకవాదిగా సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. భిన్నత్వమే భారతావని బలం... దాన్ని రూపుమాపాలనుకుంటే- జాతీయ సమైక్యతే బీటలు వారుతుందని హెచ్చరించేవారు. జనజీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆర్థిక విధానాలను అనుసరించడం ప్రభుత్వాల విధ్యుక్త ధర్మమన్నది ఏచూరి నిశ్చితాభిప్రాయం. అనుక్షణం దేశ హితంకోసం, లౌకిక ప్రజాతంత్ర సమాజంకోసం పరితపించిన ఆయన జనభారత స్మృతిలో సదా చిరంజీవి...................