ఈ పుస్తకం ఒక దీపం
మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం చైనా సాంస్కృతిక ప్రతినిధి అని చెప్పదగ్గ కన్ఫ్యూషియస్ జీవితాన్ని, బోధనల్ని, ఆచరణని ఎంతో సమగ్రంగా, ఆకర్షణీయంగా పరిచయం చేస్తున్న పుస్తకం. మామూలుగా కన్ఫ్యూషియస్ గురించిన పుస్తకాలు చదవడం కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్క పేజీకి ఎన్నో వివరణలు, ఫుట్ నోట్లు, వ్యాఖ్యానాలు ఉంటాయి. ప్రతి ఒక్క వివరణ మీదా ఎన్నో పాండిత్య వివాదాలూ, చర్చలూ ఉంటాయి. ఆయన జీవిత విశేషాల మీద కూడా ఏకాభిప్రాయం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో పాఠకులకి, ముఖ్యంగా పిల్లలకి ఎంతో సరళంగా, సుబోధకంగా కన్ఫ్యూషియస్ జీవితం గురించీ, ఆలోచనల గురించీ, ఆయన చేపట్టిన అన్వేషణ గురించీ చెప్పిన ఈ పుస్తకం చదవడం చక్కటి అనుభవం.
ఈ పుస్తకంలో వంద ఆధ్యాయాలు, అంటే దాదాపుగా వంద పేరాలు. రెండు మూడు అధ్యాయాల్లో మాత్రమే ఒకటికన్నా ఎక్కువ పేరాలు ఉన్నాయి. వాడిన భాష చాలా సరళంగా ఉంది. ఎంతో గంభీరమైన తాత్త్విక విషయాల్ని ఎంతో సులువుగా పరిచయం చేసిన తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. ఇక ప్రతి సంఘటనకీ కూర్చిన బొమ్మ ప్రాచీన చీనానీ, అప్పటి సాంఘిక-రాజకీయ పరిస్థితుల్నీ కళ్ళకి కడుతున్నది...............