వెలుతురు నేపథ్యంలో నీడల జాడలు
మ. శివరామకృష్ణ
(ఆంగ్లశాఖాధ్యక్షులు (0), ఉస్మానియా విశ్వవిద్యాలయం)
భాస్కరం గారితో పరిచయం కథకులు శ్రీపతిగారి ద్వారా కలిగింది. ఆయన గురించి విన్నా, ముఖాముఖీ కలవడం మూడు, నాలుగేళ్ళ క్రితమే. ప్రత్యేకించి ఆయన 'భక్తి' పత్రికకు సంపాదకులవడం దగ్గరినుంచి సాన్నిహిత్యం పెరిగింది. నా మనసులో కల్లూరి భాస్కరం, 'భక్తి' భాస్కరం అయ్యారు. ఆ పేరుతోనే పిలిచేవాడిని. ఒకింత చమత్కరించినా, అంతరంగ పరిపక్వతతో ప్రతి అంశాన్ని ఆయన అవలోకించడంవల్ల నేను పెట్టిన పేరులో ఔచిత్యం ఉన్నదనే సంతోషించాను.
ఈ పుస్తకం ప్రత్యేకత అదే. ప్రముఖంగా రాజకీయం అయినా, ఈ వస్తువులో మానవతా విలువల విచిత్ర విన్యాసాలు, అంతర్లీనంగా తాత్వికసూక్ష్మాలు కలిసి రాజకీయ సందర్భాలకు ఒక అపూర్వమైన సొగసును కలిగిస్తున్నాయి. రాజకీయం, ఆర్థిక, సాంఘిక విలువలతో (లేక వాటి అభావంతో) కూడుకున్నది కనుక సమకాలీన జీవితంలో వీటి భావుకత, వాస్తవికత ఒకదానితో ఒకటి పడుగూ పేకల్లా కలిసిపోయాయి. వీటికి సంబంధించి ఎన్నో మతలబులు, వెంపర్లాటలు ఇందులో కనిపిస్తాయి. ఇవి వాస్తవానికి దర్పణాలయితే, విలువల సంక్లిష్ట పరిస్థితుల నీడలలో ఉన్న దర్పణాలివి. చరిత్ర బరువును, వర్తమానంలో దాని లఘువును ప్రతిబింబించే అద్భుతమైన చిత్రాలివి. Dialectical గా thesis - anti thesis ఒకదానితో ఒకటి తలపడి, ఏ రకమైన సమన్వయం సంభవమా అని కుతూహలంతో ఉన్న పాఠకుల్ని 'మీరే ఆ పనిచేసుకోండి. నా వంతు విరుద్ధాలను విశ్లేషించడమే' నని ముగిస్తారు. ప్రతి కథనీ రచయిత. చరిత్రను 'శాసిస్తున్న' వాళ్ళ వాతనపడ్డ, చరిత్రను 'శ్వాసిస్తున్న' అమాయకుల రూపు రేఖలు అన్ని చోట్ల అందంగా కనిపిస్తాయి.
అయితే గడుసువాళ్ళే ఎక్కువ. అందుకే 'చూపు లోతుపెంచుకుని చూస్తే ఒక్కో మనిషి వెనుక ఒక్కో చరిత్ర' అంటారీయన. చరిత్రని వ్యక్తులతో కలపడం, ఆ వ్యక్తులు పెద్ద అరిందాలేమీ కాకపోవడం ఒక ప్రత్యేకత. 'నా అనుభూతికి రాని, అనుభూతికి అందని ఎనభై అయిదు సంవత్సరాల చరిత్ర బరువును మోసుకెడుతున్న' జీవనశాస్త్రవేత్త (చరిత్రను శ్వాసిస్తున్నవాడు) ఇందులోని కథలకు ఒక archetype, విశ్వజనీనమైన నమూనా, 'తన....................