కాలం చెల్లని ఆదర్శవాది
కె. బాలగోపాల్ గారి గురించి నాలుగు మాటలు రాసే అవకాశం లభించడం నాకు దక్కిన ఒక అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను. న్యాయశాస్త్ర రంగంలో దాదాపు 5 దశాబ్దాల పాటు మొదట న్యాయవాదిగా, తర్వాత న్యాయమూర్తిగా బాలగోపాల్ గారితో సహా వేల మంది న్యాయవాదులతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తిగా ఒక మాట చెప్పి తీరాలి. అతి కొద్దిమంది మాత్రమే బాలగోపాల్ గారిలా అపారమైన ఆరాధనా భావనను మనలో రేకెత్తించగలుగుతారు. ప్రతి న్యాయశాస్త్ర విద్యార్ధి, న్యాయవాది ఏ న్యాయమైన సమాజం కోసం కృషి చేయాలని ఆశిస్తూ ఈ రంగంలోకి వస్తారో ఆ ఆదర్శవాదానికి అనేక విధాలుగా బలమైన ప్రతీక బాలగోపాల్ గారు. మనలో చాలామంది ధనార్జనకో, వృత్తిపరమైన ఉన్నతి వంటి ప్రలోభాలకో లొంగిపోతాం కాని బాలగోపాల్ గారు అలా కాదు. ఆయన దృష్టిలో న్యాయవాద వృత్తికి అర్ధం ఒక్కటే - బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చడానికి అహర్నిశలూ చేయవలసిన కృషి, లౌక్యంగా బతకడం తప్పదని అనుకునేవాళ్ళు ఆయన ఆలోచనలను కాలం చెల్లిన ఆదర్శవాదంగా భావించి నవ్వుకోవచ్చు. కాని బాలగోపాల్ గారి విషయంలో ఈ ఆదర్శవాదం ప్రపంచ పోకడలకు తగ్గట్టుగా ఎదగని ఒక యువకుడి మనస్తత్వం కాదు; నిరాశావాదానికి, నిరుత్సాహానికి ఏ మాత్రం తావు ఇవ్వకూడదన్న కృతనిశ్చయంతో రూపు దిద్దుకున్న ఆదర్శవాదం అది. చివరివరకు తన ఆదర్శవాద నియమాల ప్రకారమే బతికిన మనిషి ఆయన.
దేనికీ ఉత్సాహపడకుండా నిర్లిప్తంగా ఉండే న్యాయవాదులు సైతం బాలగోపాల్ గారి గురించి, ఆయన రాత్రి పగలు కూడా బస్సుల్లో, రైళ్ళలో, రిక్షాల్లో, కాలినడకన మారుమూల గ్రామాలకు, పట్టణాలకు ఏవిధంగా ప్రయాణిస్తుంటారో ఆ విషయాల గురించి ఎంతో విస్మయంగా - ఇంకా చెప్పాలంటే ఒకింత గర్వంగా చెప్పుకుంటుంటారు. ఆ ప్రయాణాలలో ఆయన తనను కలిసిన బాధితులందరికీ, బహుశా ఒక వైద్యుడు రోగికి ఇచ్చే లాంటి ఆశను, చట్టం ద్వారా న్యాయం పొందవచ్చన్న ఆశను ఇచ్చి ఉంటారు.............