బ్లడ్ రన్నర్
కిల్లర్ పెదవుల మధ్య గోల్డ్ టిప్స్ సిగరెట్ ఎర్రగా వెలుగుతోంది. సుమారు పదిరోజులుగా అతను తన విల్లాలోనే వుంటున్నాడు. బయటకు కదలడంలేదు.
'సఫారీ' ఎస్సయిన్మెంట్లో తగిలిన గాయాల నుంచి తేరుకోవడానికి కొన్నిరోజులు కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డబ్ల్యు. కె.ఓ. డాక్టర్ ఇన్ చీఫ్ ఎడ్వయిజ్ చేశాడు. మరెక్కడున్నా అనవసరమైన విషయాల్లో తల దూరుస్తాడనే ఉద్దేశ్యంతో ఇండియాలోని కిల్లర్ కి వెళ్ళిపోమని ఆర్డర్స్ పాస్ చేశాడు డైరక్టర్.
కిక్కురుమనకుండా తన విల్లాకివచ్చి రెస్ట్ తీసుకుంటూ వుండిపోయాడు కిల్లర్. ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా వుంచడానికి కిల్లర్ చాలా తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ డాక్టర్ పద్మప్రియకెలా తెలిసిందో తెలియదు. సంగతి తెలియగానే రెక్కలు కట్టుకునివచ్చి కిల్లర్ ముందు వాలింది.
"నరేన్! ఈ సంగతి నాకెందుకు కబురుచెయ్యలేదు ? నేనంత కానిదాన్ని అయ్యానా ?" - అంది పద్మప్రియ నయనాలు తడితేరుతుండగా.
"ఇవి ఏమంత ప్రమాదకరమయిన గాయాలని నీకు తెలియజేయడం ? ఇలాంటివి. నాకు కొత్తకాదుగా.... నా జీవితంలో సర్వసాధారణమయిన విషయాల్లో ఇదొకటి. అందుకే నిన్ను డిస్ట్రబ్ చెయ్యలేదు....!" అన్నాడు కిల్లర్ తాపీగా,
"డిస్ట్రబ్....! చాలా చిన్న వర్డ్ అది.... కానీ దాని వెనుకనున్న అర్థం చాలా పెద్దది. అది అర్ధంకావాలంటే ప్రేమించే హృదయం వుండాలి. మీలో ఏ మూల అయినా నామీద కొంచెం అభిమానంవున్నా ఇలా చేసి వుండేవారుకాదు. నాకు వెంటనే తెలియజేసి వుండేవారు....!" అంది పద్మప్రియ బాధగా..................