పరిచయం
ఎవరీ ముసునూరి నాయకులు?
కదన రంగంలోనే కాక, కళాపోషణలోనూ తమదైన ప్రత్యేకతను చాటుకొన్న కాకతీయుల పాలనకాలం (క్రీ.శ.1052-1323) తెలుగు జాతి చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం.' శాతవాహనుల తరువాత తెలుగు భాషను మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒక్కటిగా చేసిన కాకతీయులు కవి, పండితులను పోషించి, వాస్తు, శిల్పకళలను ప్రోత్సహించి తెలుగు సాంస్కృతిక వికాసానికి పాటుపడ్డారు. వీరు మొదట రాష్ట్రకూటులకు, తరువాత కళ్యాణ చాళుక్యులకు సామంతులుగా నేటి తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల మూలపురుషుడు వెన్నరాజు. ఆ తరువాత కాకర్త్య గుండన, బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండోబేతరాజు, రెండో ప్రోలరాజు తరువాత రుద్రదేవమహారాజు (క్రీ.శ.1158-95) స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించాడు. అతని తరువాత మహాదేవుడు (క్రీ.శ.1195-98), కాకతీయ గణపతిదేవుడు (క్రీ.శ.1199-1261), రుద్రమదేవి (క్రీ.శ.1261-89), ఆ తరువాత ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1290లో అధికారాన్ని చేపట్టి చక్రవర్తిగా క్రీ.శ.1323 దాకా పాలించాడు. కళకళలాడుతున్న కాకతీయ తెలంగాణాపై కన్నుబడి ఢిల్లీ సుల్తాన్ క్రీ.శ.1303 నుంచి క్రీ.శ.1323 వరకూ ఐదుసార్లు దాడిచేశాడు. '
క్రీ.శ.1323లో కాకతీయ ప్రతాపరుద్రుడు ఢిల్లీసుల్తాన్ చేతిలో బందీ అయిన తరువాత, కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ముస్లింల వశమైన తెలుగునేలను విడిపించటానికి బతికిబయటపడిన కాకతీయ నాయకులు, మిత్రులు ఒక సమాఖ్యగా ఏర్పడినారు. పోరాటాన్ని నడిపించటానికి వారిలో ఒక నాయకుణ్ణి ఎన్నుకోవాలనుకొన్నారు. ప్రతాపరుద్రుని సేనానాయకులైన బెండపూడి అన్న మంత్రి, కొలని రుద్రదేవుడు, రేచర్ల సింగమనాయకుడు, ప్రోలయ వేమారెడ్డి కలసి, మిగతా వారిని సంప్రదించి సమాఖ్య నాయకునిగా ముసునూరి ప్రోలయనాయకున్ని ఎన్నుకొన్నారు. ఈ వార్త తెలిసిన ప్రజలు, ఇప్పటివరకూ పేరుకూడా వినని ఈ ప్రోలయ నాయకుడెవరని ఆరాదీశారు. ఆయన వంశాన్నీ, పూర్వీకులను గురించి తెలుసుకొని, దక్షత గల వీరుణ్ణి ఎన్నుకొన్నారని ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. *
ముసునూరి ప్రోలయనాయకుడే విడుదల చేసిన విలస దాన శాసనంలో" ఆయన గురించి 'త ప్రశస్తా ముసునూరి వంశో" అని, ప్రోలభూపోముసునూరి వంశ్యే' అని, కాపయ నాయకుని ప్రోలవరం శాసనంలో ''ముసునూరి ప్రోలనృపతి' అని పేర్కొనటాన ప్రోలయ నాయకుడు, ముసునూరి వంశీకుడని తెలుస్తుంది. చోడభక్తిరాజు పెంటపాడు శానసం ద్వారా, ప్రోలయనాయకుని పూర్వీకుల గురించి తెలిసింది. తద్వారా, ప్రోలయనాయకుని తాత, తండ్రి, తండ్రులు, సోదరులు కూడ ముసునూరి వంశీకులేనని తెలిసింది..................