“ఆప్తవాక్యం”
'కాలం' ఎవరికోసమూ, ఎందుకోసమూ ఆగదు, అది అలా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది, అది దాని లక్షణం..... 'కులం' నాకేం చేసింది?! అని ఆలోచించే వారికి నా విజ్ఞప్తి ఒక్కటే... 'కులం' మీకు ఏమీ చెయ్యదు, 'కులానికి' మీరే ఏమైనా చెయ్యాలి, తప్పదు. తక్కిన కులాలు 'అభివృద్ధి' వైపు ఆకాశమంత ఎత్తుకు ఎగిరాక, తల పైకెత్తి ఆశ్చర్యంతో, భయంతో, ఆవేదనతో చూస్తున్న మీరు తల తిప్పి సాటివాడిని, మీ తోటివాడిని, మీ కులస్తుడిని చూడండి, సోదర భావాన్ని పెంపొందించుకోండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మాత్రం అనుకోవద్దు, ఆ ఎవరో మీరే ఎందుకు కాకూడదు?! తమిళనాడులో 'సేలం'కు చెందిన పగడాల నరసింహులు నాయుడు వ్రాయకపోతే 'బలిజ వారి పురాణం' లేదు, పండిత కంటే నారాయణ దేశాయ్ లేకపోతే 'బలిజకుల చరిత్ర' లేదు. ఎందరో ఎందరెందరో ఎందుకోసం? ఎవరికోసం?! అని ఆలోచిస్తూ కూర్చుంటే ఈ గ్రంథం కూడా లేదు "30 సంవత్సరాలు” సరిగ్గా ‘30 సంవత్సరాల' తపన, 30 సంవత్సరాల పరిశోధన, 30 సంవత్సరాల మేధో మథనం, 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం... 80వ దశకంలో ఆవిర్భవించిన ఉద్యమం, ఉద్యమ నాయకులు, సంబంధిత సంఘాలు ఈ గురుతర బాధ్యతను భుజాలకెత్తుకున్నా... ఈ క్రమంలో ఒక్కొక్క అంశాన్ని వెదికి పట్టుకోవడం, వెలికి తీయడం ఎంతో కష్ట సాధ్యమైన విషయం. ఈ మధ్య కాలంలో పరిశోధన, విషయ సేకరణ, కావల్సిన సమాచారం ఆశించిన మేర అందుబాటులోకి వచ్చాక 2005వ సంవత్సరంలో 'రచన'కు ఉపక్రమిస్తే 2010వ సంవత్సరానికికానీ ఒక రూపు దిద్దుకోలేదు. ఈ మధ్యకాలంలో 2007వ సం॥లో "కాపులు సామాజిక రాజకీయ విశ్లేషణ" అనే చిరు ప్రయత్నం చేస్తే, ఊహించని స్పందన, మరీ ముఖ్యంగా 'యువతీ యువకుల' నుండి!!!
మొదట్లో బలిజ పురాణం, బలిజ కుల చరిత్రల్ని యధాతథంగా ప్రచురిస్తే సరిపోతుంది కదా అనిపించింది, అయితే ఆ రెండు ప్రామాణిక గ్రంథాలూ శుద్ధ గ్రాంథికంలో ఉన్నాయి, 'తెలుగు' భాషపై పట్టు, అధికారం ఉన్నవారికే అవి అర్ధమయ్యే స్థితిలో ఉన్నాయి, దానికి తోడు అప్పటికే సేకరించిన ఇతర సమాచారం కూడా ప్రాధాన్యతని సంతరించుకోవడంతో ఈ రచనకు నేను పూనుకోవాల్సి వచ్చింది, బలిజ పురాణం, బలిజకుల చరిత్రలోని కొన్ని చారిత్రక ఆధారాల్ని, ముఖ్య సంగతులను వ్యావహారిక భాషలోనికి తిరగ వ్రాయవలసి వచ్చింది... వాటిని ఈ గ్రంథంలో పొందుపరచాను. 1999వ సంవత్సరంలో విజయవాడ సమీపంలో గల హనుమాన్ జంక్షన్లో జరిగిన రాష్ట్ర స్థాయి సంఘ సమావేశానికి నేను కూడా హాజరుకావడం జరిగింది, రాష్ట్ర యువ కాపునాడు అధ్యక్షుడి హోదాలో! రాష్ట్ర యువకాపునాడు మొదటి అధ్యక్షుడిగా కాపునాడు నా పేరును ఏకగ్రీవంగా తీర్మానించి, ఆ కార్యక్రమానికి ఆహ్వానించింది, సాయంత్రం విజయవాడ నుండీ హనుమాన్ జంక్షన్కు ఒకే కారులో మిరియాల వెంకటరావుగారు, కె. కేశవరావు (కెకె) గారు, నేను బయలుదేరి వెళ్ళాం, సభ విజయవంతంగా ముగిసింది, చింతా శేషగిరిరావు, చిలంకుర్తి అంబులు, ఆచంట వెంకటరత్నం నాయుడు, డా॥ దుట్టా రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, నిమ్మకాయల వీర రాఘవనాయుడు, వంగవీటి శోభనాచలపతిరావు గార్లు కూడా ఆ సభలో పాల్గొని వారి అనుభవాలను వేలాది మంది సంఘీయులకు వినిపించి ఉత్తేజితుల్ని చేశారు... ఆ తర్వాత కారులో తిరిగి వస్తున్నప్పుడు కుల చరిత్రల ప్రస్తావన వచ్చింది, మిరియాల వెంకటరావుగారు, కంచర్ల కేశవరావు (కెకె)గారు వాటి ప్రాధాన్యతను, ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు...
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి పర్యవేక్షణలో నా చేత పరిశోధనాత్మక గ్రంథం వ్రాయించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సంఘ సమావేశాలు, కార్తీకమాస వన........................