దయా పారవతం శ్రీనివాస్ కావ్యం
చక్రవర్తి అశోకుని జీవిత గాధను దీర్ఘ కవితగా చెప్పాలనే సంకల్పం మాటూరి శ్రీనివాస్ కలగడం అది ఈ "దయాశోకుడు"గా రూపు దిద్దుకోవడం, ఇది ఒక విశిష్ట సాహితీ సందర్భం. 'రాజుల చరిత్రలన్నీ రక్తసిక్తమే, గతమంతా తడిసే రక్తమును, కాకుంటే కన్నీళ్ళలలో..." అన్నాడో కవి. కావచ్చును కానీ, అక్కడే ఆ రక్తాలలోనే, కన్నీళ్ళలోనే చరిత్ర ఆగిపోలేదు అని చెప్పే జీవన గాధే అశోకుని గాధ. కళింగ యుద్ధం తర్వాత అశోకునిలో మానవత మేల్కొని, పశ్చాత్తాపంతో, పరివర్తనతో బౌద్ధాన్ని స్వీకరించి ప్రపంచానికి మానవీయ విలువల్ని ప్రబోధించిన అశోకుడు నేటికీ మన భారత దేశ ధర్మ చక్రమై ప్రకాశిస్తున్నాడు. అశోకుడి గాధ సవిస్తారంగా చారిత్రాత్మక నేపథ్యంతో, నాటి సాంఘిక, రాజకీయ ప్రాబల్యాలు, వివిధ రాజ్యాల పరిపాలనలూ వీటన్నిటితోబాటు అశోకుడి జననం ముందు నుండి చివరి దశ వరకు వర్ణించిన కావ్యం ఈ 'దయాశోకం'. కవి విస్తృత అధ్యయనం, జ్ఞాన అన్వయం, భాషా పటిమ, కావ్య ఆదర్శం అన్నిటికి నిదర్శనం ఈ కావ్యం.
మానవ జీవితంలోని సమస్త భావనలూ అశోకుని జీవితంలో కలవు. దాసి మురపుత్రుడుగా న్యూనతంగా చూడబడినా, తనదైన అద్వితీయ శక్తితో చక్రవర్తి అయిన వైనం అశోకునిది. వడ్డించిన విస్తరి కాదు, రాజకుమారునిగా అశోకుని జీవితం.
అశోకుని జననాన్ని వర్ణిస్తూ కవి అంటాడిలా “జన్మనివ్వగ సుభద్రాంగి ప్రమోద వనమున అవతరించెను కర్మయోగి ఒకడు / మర్మమెరిగిన మొనగాడు / ప్రవర్తింప దమ్మ ప్రవీరుడు / విశ్వవ్యాప్తము చేయు మగధను విక్రాంతు / సరిలేనిదమ్మ సూరీడు / దేవానాం ప్రియుడు అశోకుడతడు" ఇలా బాల అశోకుడిని వర్ణిస్తూనే కవి అతని భవిష్యత్తు కార్యాచరణను కూడా మనకి సూచ్యప్రాయంగా తెలియజేస్తాడు. ఇది ఈ కావ్య శైలి అని చెప్పడానికే ఈ ఉదాహరణ ఇచ్చాను. మొత్తం కావ్యమంతా అశోకుడి వివిధ దశలలో వివిధ రూపాలను వర్ణిస్తూ సాగే కావ్యమిది. "అశోకుని జననమే అనంతరపు దృష్ట్యాంతములలో / కూడి వాస్తవ వృత్తాంత బహు గ్రంథమైనది / అది నవ దీప నవనీత నవరూప చరితమైనది." అంటూ బాల్యంలో అశోకుడు..............