పై పైకి వెళ్లిపోయిన ఆకాశాన్ని అందుకోవడం కోసమన్నట్టుగా పుజ్బెత్తుగా లేచిన యెర్ర మిట్టపైకి వెళ్ళాక, కారును రోడ్డు అంచుల్లో ఆపి, కిందికి దిగి, కారు వెనకే పరిగెత్తుకొస్తున్న పొడవాటి వ్యక్తికేసి తిరిగి, "యెక్కడ? యింకా యెక్కడ?" అని పెద్దగా వుద్వేగంగా అరిచాను.
మరో రెండు నిముషాలకు గానీ అక్కడికి చేరుకోలేకపోయిన ఆ మనిషి, చేతిని యెడమవైపుకు చాపి “యిక్కడనే యిక్కడనే సా... బారెడు పొద్దెక్కిందాంకా ఆ యిద్దురు పోలీసోళ్లూ యిక్కడనే పడిగాపులు పడినారు.. యిప్పుడే అరగడియకు ముందర్నే తెల్లజీబొచ్చి పీనిగనెత్తుకోనిపోయింది. ఆ పోలీసోళ్లు దాంట్లోనే యెక్కూడ్సివారు, " అన్నాడు గసలు పోస్తూ.
రోడ్డుకు పది మీటర్ల దూరంలో ముళ్ళ పొదల మధ్యలో బీడుగావున్నచోటు, రాత్రంతా అడవి జంతువులు పాడుచేసి వెళ్ళినట్టుగా గజిబిజిగా వుంది. అక్కడ రెండు అడుగుల వెడల్పుతో ఆరడుగుల పొడవుతో యెవరో వంకరటింకరగా దీర్ఘచతురస్రపు ఆకారంలో గీత గీసివున్నారు. దానికి నాలుగు మూలల్లో ఫుట్బాల్ అంత పెద్ద రాళ్లను పెట్టారు.
"యిక్కడేముండాదని యీ యెండలో యింత దూరం వచ్చుండావు చిన్నసా." అనే మాట వినబడగానే దిగ్గును వెనక్కు తిరిగి చూశాను. "ఆ తోపులోకైనా వచ్చుంటే కూర్చునే దానికి కుర్చీలు అయినా వుండాయి. యీ పాడూ యిషండం మనిషి చచ్చి కూడా సాధిస్తావుండాడు," అంటూ చిట్టెమ్మ అంగలార్చింది. "దేశం గాని దేశం నుంచి వచ్చి వొక దినం కూడా కాలేదు. యీ పాడూ దొబ్బుడు లేకుంటే యీ పాటికి పెండ్లి చూపులకు...............