“వేసవికాలం వస్తోందంటే చాలు రిజర్వేషన్ కౌంటర్లన్నీ కిటకిటలాడిపోతాయి. ఎండలోపక్క మాడ్చేస్తుంటే ఈ జనాలు ఎవరి కొంపల్లో వాళ్ళు పడుండక ఊళ్ళట్టుకు తిరగడం ఎందుకో! ఇంటిపట్టున హాయిగా ఎలా ఉండొచ్చో ఒకళ్ళకీ తెలిసి చావదు. దానికితోడు ఈ గవర్నమెంటు వాళ్ళు అందరికీ ఎలాసిలిచ్చేసి ఊళ్ళమ్మట తిరగండో అని తోల్తున్నారు." పాపం ఎండవేడికి, ఉక్కపోతకి తాళలేక క్యూలో నిలబడ్డ ముసలాయన దేశంలో అందరినీ తిట్టి పోస్తున్నాడు. కాని మరి ఆయన ఏ అవసరం పడి ప్రయాణం పెట్టుకున్నాడో!
అసలే అది ఢిల్లీ రూటు, రిజర్వేషన్ కౌంటరు. అందులో వేసవి కాలం. పైపెచ్చు ఎసి క్లాసులకి. ఇంక చెప్పేదేముంది. కానీ విచిత్రం. సరిగ్గా నెలతర్వాత ఇదే రోజు అంటే మే 12కి ఎ.పిలోనూ, దక్షిణ్ లోనూ కూడా బెర్తులున్నాయని పచ్చలైట్లు వెలుగుతున్నాయి. ఇంతలో ముసలాయనకి ముందున్న ఒక సగటు ప్రాణి చేతులు లోపలికి పెట్టి మూడు ఫారాలిచ్చాడు.
"మూడు ఫారాలేవిటయ్యా!"
"ఒక్కో ఆర్గుర్ని కన్నా నింపరాదు గద సార్. ఖాందాన్ మొత్తం పోవాల. ఇంట్ల లగ్గమాయె!”
"ఇలాటి వాటికి గ్రూప్ రిజర్వేషన్ అడగొచ్చయ్యా! ముగ్గురి సంతకాలు తెచ్చావు. గట్టివాడివే!”
"పెద్దసేటు, డాలీ బేబి, మున్నీసాబు చేసినండి.”
"మే 12, నాగపూరు, ఎ.పిలో రెండే ఉన్నాయయ్యా.” "ఎ.పి. లేకుంటే దక్షిణ్ తెమ్మన్నాడు సేరు."
"దక్షిణ్ పదమూడున్నాయి. మూడు ఆర్ఎస్. పనికొస్తుందా?" “కానియ్ సారూ!”
"సేట్ మానిన్లాల్ 75, వందనాదేవి 70, రతన్లాల్ 52, లక్ష్మీదేవి 50, నందలాల్ 50, రుక్మిణీబాల 46, ప్రేమలాల్ 46, ఆశాజ్యోతి 40, పరిమల్సానీ 50, కిరణ్సినీ 48, అర్చన 18, ప్రేమలత 16, కన్హయ్య 16, మందాకిని, వినోద్, మధుబాల 11, 11, 11 ... చాలా మంది పదకొండులున్నారే.”..................