ధూర్జటి
“చెల్లీ, బహువిచిత్రముగా ఉన్నదేమే నీ తీరు ఇవ్వాళ?”
అంతవరకు పరధ్యానముగా ఉన్న మోహిని ఆ మాటలు విని ఉలికిపడినది. అక్క మదనిక తన దగ్గరకు వస్తున్నది. అక్క తన్ను తాకునేమో అన్న భయముతో తాను కూర్చున్న పట్టుపరపు నిషద్యమీదినుంచి లేచి నిలిచి, తాకవద్దని అక్కను నిషేధిస్తున్న దానివలె ప్రక్కకు తొలగినది. అది గమనించి మదనిక రెట్టించిన ఆశ్చర్యముతో ఆదరముతో మరింత సమీపిస్తున్నది.
వెంటనే మోహిని బిగ్గరగా, “అక్కా, అక్కా, దూరంగా ఉండు. నేను మడికట్టుకొన్నాను. తాకబోకు. నీ వింకా స్నానమైనా చేసినట్లుగా లేదు. రాత్రి కట్టుకున్న బట్టలు మార్చలేదు" అన్నది.
మదనికకు అదేమో అర్థము కాలేదు. తమ కులాచారము ననుసరించి ఎప్పుడో మహాపర్వదినాలలో తప్ప, మోహినికాని, తానుగాని మడికట్టుకోవడమెరుగరు. అది కూడ బ్రాహ్మణస్త్రీల మడివలె ఎవ్వరును తాకరాని మడికాదు. అందువలన చెల్లెలి ఈ క్రొత్తమడి మాటలు దానికేమీ బోధపడలేదు. రూప యౌవన విలాసాలతో మునీశ్వరులనే ప్రలోభపెట్టగల అప్సరవంటి తన ముద్దుల చెల్లెలికి మతి యేమైనా కొంచెము చలింపలేదు గదా!
తనకెందుకు? తన కా రాత్రి కలిగిన అనుభవానికి నవ్వుకోవలెనో ఏడువవలెనో తోచకున్నది. తనకు కన్నెరికము తీరినతర్వాత గడచిన ఈ ఏడెనిమిదేళ్లలోను బహుచిత్రములైన అనుభవాలు ఎరిగివున్నది. కొందరికి దేహమే కావలె. కొందరికి................