దిగంబరం
ఎర్రటి మంటలు భుగభుగలాడుతూ జ్వాలల నాలుకలు చాస్తూ, బుస్సుమని బుసలు కొడుతూ గాలిలోకి దూసుకొస్తున్నాయి. పురోహితుని కంఠంలోంచి శ్రావ్యంగా వెలువడే ఇంద్ర స్తోత్రాలకి పరవశించి పడగవిప్పి ఆడే వెయ్యితలల నాగులా మంటలు పిచ్చిగా ఊగుతున్నాయి. వరుణదేవుణ్ణి శాంతింపజేయడానికని శివాలయంలో జరుగుతూన్న ఆ యజ్ఞానికి హాజరయ్యానంటే నేనేదో భక్తుణ్ణని కాదు. కేవలం సమాజ సంక్షేమ సౌభ్రాత్ర సమితి అధ్యక్షుని సంతోషంకోసం మాత్రమే వెళ్లాను. నిజం చెప్పాలంటే నామట్టుకి నాకది కేవలం వ్యాపార వ్యవహారం. రాష్ట్రంలో సంభవించిన వరదల తాలూకు భీభత్సాన్ని చిత్రించే పని ఆ సమితి నాకప్పజెప్పింది. వరద భీభత్సాన్ని నా సజీవ చిత్రాల్లో చూసి ప్రజలు కదిలి పోవాలని సమితి ఆశయం. ప్రజల్ని కదిలించటానికి తల పెట్టిన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేయబోయే చిత్రకళా ప్రదర్శన కోసం సమితివారు నన్ను బొమ్మలు గీసి పెట్టమని కోరారు..............