డిమ్మి
“దైవాన దైవానందాన...
నేనెల్లిపోతా భగమంతా... దైవాన దైవానందాన...
ధనముందీ భాగ్యముందీ శంకరా... దైవాన దైవానందాన...
కడుపూ... లోపటా సంతూ బలమూ లేదయ్యా...
దైవాన దైవానందాన...”
తెల్ల నిలువుటంగీ తొడుక్కొని, తలకు గులాబీ రంగు తలపాగా చుట్టుకొని, భుజానికి జోలె, ఆనిగెపుకాయ బుర్ర (తంబూర) తగిలిచ్చుకొని, ఎడమ చేతి వేళ్లకున్న అందెలను తంబూరకు తట్టుతూ, కుడి చేతి వేళ్లతోని తంబూర తీగలను లయబద్ధంగా మీటుకుంటూ ఓ ఇంటి గేటు ముందర నిలవడి పాడుతున్నడు. శంకరయ్య. అతని కండ్లు ఎంత తూడ్సుకున్నా తడి తడిగానే ఉంటున్నయ్. పాడుతుంటే నడ్మ నడ్మల గొంతు బొంగురువోతున్నది. గుండెలున్న బాధ సముద్రపు అలల్లాగ ఉప్పొంగుకొస్తుంటే, ఆ బాధను దిగమింగుకుంట అట్లే పాడుతున్నడు.
కొద్దిసేపటికి ఒకాయన బయటికొచ్చి "మొన్న గుడ్క నీవే గదా వొచ్చింది. మొన్న రెండ్రూపాలిస్తిగద! మల్లొచ్చినవా? అందుకే ఇయ్యగూడదు. ఒక్కసారిస్తే మల్ల మల్లొస్తరు. పో... పో... ఇప్పుడేం లేవు పో!" అని కసిరిండు.
"అయ్యా... సారూ... కాల్మొక్త బాంచన్! ఎంతో అంత
పున్యముంటది!" దీనంగ బతిమ్లాడిండు శంకరయ్య.
సారూ...
“అరే... పోయిరా పోయ్యా. ఇప్పుడేం లేవంటున్న గద” చెప్పి ఎల్లిపోయిండతను.
తంబూరను మల్ల వాయించుకుంట ఇంగో ఇంటి ముందుకు వొయి
పాడుతున్నడు శంకరయ్య.
"బిడ్డె బలమూ దీసుకోని యెల్లిపోరాదా...
అయ్యో రామా... దేవా రామా...
దేవా రామో... దైవ రామా...