మూసి ఉన్న కనురెప్పలు.
నరాలు లేచి కనుపాపలు కదిలి, మెల్లిగా కళ్ళు తెరుచుకుంటున్నాయి.
గాలికి తలుపు తెరుచుకుంటున్న దృశ్యం.
గడప దాటేసి దూసుకు వస్తున్న వెల్తురు.
శుభ్రమైన కన్ను. మధ్యలో నల్లని గుడ్డు. కనుగుడ్డు గోళం లాగా అయ్యి తనచుట్టు తాను తిరుగుతోంది. గోళం నిండా సముద్రం, ఖండాలు. ఖండాలు కత్తిరించినట్టు దేశాలు. దేశాల్ని ముక్కలు కోసినట్లు రాష్ట్రాలు. గోళం తిరుగుతోంది. సముద్రపు అలలు... వృక్షాలు, జంతువులు, పొలాలు, ఊళ్లూ, అనాగరికులు, ఎడారులు, నగరాలు, నాగరికులు, గుట్టలు, లోయలు...
సముద్రపు అలలు... గోళం మెల్లగా తిరుగుతోంది.
ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఆసియా దక్షిణంలో పూర్తి చివరికొసలో భారతదేశం.
వ్యవసాయదేశంలాగా ఆకుపచ్చ రంగులో భారతదేశం! ఆకుపచ్చ రంగుమారి నల్లని చుక్కలు కనిపిస్తున్నాయి. చుక్కలు మెల్లిగా కదులుతున్నాయి. నల్లని చుక్కలు మనుషుల తలలవుతున్నాయి. ముఖాలు కనిపిస్తున్నాయి. బరువుల్తో, బాధ్యతల్తో కృంగి కృశిస్తున్న మనుషులు. కోట్లకు కోట్లే. గజిబిజిగా సందులేకుండా... పీక్కు పోయిన ముఖం, కింద చిన్న మెడ, బొమికలు తేలిన రొమ్మూ, భుజాలు, అతుక్కుపోయిన డొక్క చింకిపంచె కట్టెపుల్లలా కాళ్లూ, కాళ్ళకు బలమైన యినుప గొలుసులు. వెనక్కిలాగి చేతులకు వేసిన బేడీలు. భారతదేశపటం మీద హింసింపబడుతూ.
డా. దేవరాజు మహారాజు