దోషికి నిద్ర పట్టదు!
రాత్రి తొమ్మిది అవస్తోంది. సముద్రానికి దగ్గరగా వున్న సమ్మర్ విల్లా భవనంలోకి రాజారావు అడుగుపెట్టాడు. ఫ్లోరసెంటు దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. తన భార్య మనోరమకోసం నలువైపులా చూశాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. లోలోపల విసుక్కున్నాడు.
కాశ్మీర్లో మూడు నెలలుండి మళ్ళా అతను తిరిగొచ్చాడు. మద్రాసులో వున్న మామగారిల్లు చేరుకున్నాడు. మనోరమ ఇంట్లో లేదు. మహాబలిపురంలో కట్టించిన సమ్మర్విల్లాలో ఆమె విశ్రాంతి తీసుకుంటోందని మామ చెప్పడం మూలంగా తిన్నగా అతనిక్కడికి వచ్చాడు.
తన భార్య ఏరోడ్రోమ్కి వచ్చి స్వాగతం చెపుతుందనుకున్నాడు. తనొస్తున్నట్లు ముందు టెలిగ్రామ్కడా ఇచ్చాడు. ధనవంతుల కూతుళ్ళను పెళ్ళాడితే ఇలాగే ఉంటుందేమో! రాజారావు హాల్లోకి ప్రవేశిస్తూంటే కనకరాజు ఎదురయ్యాడు.
"హల్లోవ్, ఎప్పుడొచ్చారు?” అడిగాడు కనకరాజు.
“ఇప్పుడే. మనోరమని ఎక్కడేనా చూశారా?" అడిగాడు రాజారావు. "ఇందాకా చూశాను. ఆమె చాలా బిజీగా వుంది. మీకు తెలిసిన అతిథులు హాల్లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళను కలుసుకోండి.”
ఏదో అర్జెంటు పని వున్నట్లు కనకరాజు పోర్టికోలోంచి ఎడంవైపుకి తిరిగి తోటలోకి దూసుకుపోయాడు.
రాజారావు హాల్లో నడవసాగాడు. హాలు ప్రకాశవంతంగా వుంది. పెద్దహాలు, దీపాల కాంతిలో మొజాయిక్ ఫ్లోరు మెరుస్తోంది. కొంచం దూరంలో కొందరు కౌంటరు ముందు నిలబడి కోకోకోలా తాగుతున్నారు. మాట్లాడుతూ నవ్వుతున్నారు. రాజారావు వాళ్ళవైపు నడిచాడు. కౌంటరు ముందుకి వెళ్ళాడు. తెల్లటి యూనిఫారమ్ ధరించిన పుల్లయ్య రాజారావుకి నమస్కరించి ఒక కోకోకోలా బుద్దిని తెరిచి వేసి అందించాడు.............